Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ మామూలుగా లేదు.. బ్రహ్మోత్సవాలు కావడంతో?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది

Update: 2024-10-05 02:51 GMT

brahmotsavam in tirumala2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీధులన్నీ గోవింద నామ స్మరణతో మారు మోగిపోతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నిన్న ధ్వజారోహణంతో ప్రారంభమయిన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు సాగనున్నాయి. స్వామి వారిని మాడ వీధుల్లో తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వేచి ఉన్నారు. వసతి గృహాలు కూడా దొరకడం లేదు. అయినా భక్తులు బయట షెల్టర్లలోనే ఉంటున్నారు. పిల్లా పాపలతో వారు అక్కడే ఉండి కాలకృత్యాలను కూడా సమీపంలోని సామూహిక మరుగుదొడ్లలో తీర్చుకుని, అక్కడే ఉన్న కోనేటిలో స్నానం చేసి, తలనీలాలను సమర్పించుకుని దర్శనానికి వెళుతున్నారు.

బయట వరకూ క్యూ లైన్...
ఈ తొమ్మిది రోజుల పాటు తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. భక్తులతో పాటు పోలీసు సిబ్బంది, అధికారులతో పాటు కూడా ఉండటంతో ఎక్కువగా వీధుల్లో కనిపిస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ ఏటీజీహెచ్ వరకూ లైన్ ఉండటంతో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 54,866 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. వారిలో 28,657 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News