తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం టీటీడీ నిర్వహించనుంది. జూలై 17న ఆణివార

Update: 2023-07-05 02:34 GMT

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 76,254 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం టీటీడీ నిర్వహించనుంది. జూలై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఉదయం 6 గంటల నుండి సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఆరోజున అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసిందని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆనవాయితీ ప్రకారం సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


Tags:    

Similar News