తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు కూడా కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు కూడా కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 88,836 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.69 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారికి 35, 231 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
జులై 11న తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పురస్కరించుకొని 11న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజున బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. 10న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. టీటీడీ జులై 11న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. జులై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తిరుమంజనం కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుంది.. 5 గంటలపాటు కొనసాగనుందని టీటీడీ తెలిపింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.