తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయనుంది
తిరుమలలో బుధవారం నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 71,935 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 31,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయనుంది టీటీడీ. జూన్ 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 26 (1135 నంబర్లు ) లాట్లు ఈ-వేలంలో ఉంచారు. టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.govt.in ను సంప్రదించాల్సి ఉంటుంది. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించాలని టీటీడీ అధికారులు సూచించారు. ఆసక్తి కలిగిన భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.