రాజకీయంగా....
వైఎస్సార్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండే రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు వాటంతట అవే రావు. ఎన్నో కష్టాలు. ఎన్నో అవరోధాలు. అన్నీ ఎదుర్కొని ఆయన ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న తీరు మాత్రం ఇప్పటి నేతలకు ఒక పాఠం లాంటిది. వైఎస్సార్ ను ఒక ఫ్యాక్షన్ లీడర్ గా చూసే వాళ్లు కూడా ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు, ఆయన గురించి తెలిసిన వారికి మాత్రం వైఎస్సార్ లో అది ఇంచుమాత్రం కూడా కనిపించదు. ఇక రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ లీడర్ అనే ముద్రను ఆయన చేరిపేసుకోలేదు. అప్పటి వరకూ ఆ రకంగా భావించిన వాళ్లు తమకు తామే ఆ భావాన్ని మనసులో నుంచి తొలగించేసుకున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరస్థాయిగా పేరు గుర్తు ఉందంటే ఆయన అమలు పర్చిన పథకాలు.
ఒకసారి ఆయన వద్దకు వెళ్లిన వాళ్లు...
వైఎస్సార్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తీసుకురాగలిగారు. తాను ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఎలా ఉండేవారో.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే తరహాగా ఉండేవారు. భేషజానికి పోవడం ఆయన డిక్షనరీలోనే లేదు. శత్రువులను కూడా మిత్రులుగా చూసే మంచి మనసు వైఎస్సార్‌ది. ఈనాడు ఎందో రాజకీయ నేతలకు రాజకీయ బిక్ష పెట్టింది కూడా వైఎస్సార్. ఒక్కసారి మనిషిని నమ్మితే మాత్రం ఇక ఆయన వదలిపెట్టరని ఆయనతో కలసి నడిచిన వారు ఎవరైనా అంటారు. ఆయన నవ్వు చాలు... సర్వరోగనివారిణిగా భావిస్తారు. ఆయన వద్దకు వెళితే పేరు పెట్టి పలకరించి ఒక నవ్వు నవ్వారంటే వచ్చిన పని మర్చిపోయిన వాళ్లు ఎంతో మంది ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
పేదల కోసం...
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలను తొలగించే సాహసం ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీ చేయలేదంటే.. అది ఒక్కటి చాలు ఆయన పాలనకు ఒక ఉదాహరణ. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 1100 కోట్ల వ్యవసాయ విద్యుత్తు బకాయీలను రద్దు చేశారు. ఇక ఆరోగ్య శ్రీ తో ఆయన ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా మారిపోయారు. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించి ప్రాణాలకు భరోసా ఇచ్చిన మహానేతగా మారిపోయారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 85 ప్రాజెక్టులను చేపట్టారు.
డాక్టర్ నుంచి...
1949 జులై 8వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మించారు. డాక్టర్ వృత్తి చేపట్టినా ఆయనకు ప్రజలకు మరింత సేవ చేయాలన్న తపనతో రాజకీయాలను ఎంచుకున్నారు. కడప ప్రాంతంలో ఒక రూపాయికి వైద్యం చేసిన వైద్యుడిగా ఆయనను ఇప్పటికీ తలచుకుంటారు. రాజకీయపరంగా ఆయనను సొంత పార్టీలోనైనా, ప్రత్యర్థి పార్టీల నేతలైనా విభేదించవచ్చు. కానీ ఆయనను వ్యక్తిగతంగా మాత్రం ఎవరూ శత్రువుగా చూడరు. తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరును ఇంటింటా మారుమోగే ఒకే పేరు వైఎస్సార్. ఆయన మరణించి పదిహేనేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన పేరు అందరి మనసులో ఉంటుందంటే.. ఆయన పనిచేసిన తీరు. అమలు చేసిన పథకాలు. అందుకే ఎప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.