మలేషియాలో విషాదం.. కుప్పం మహిళ అదృశ్యం

మలేషియాలో విషాదం చోటు చేసుకుంది. సింక్ హోల్ లో పడి తెలుగు మహిళ అదృశ్యమైంది

Update: 2024-08-24 06:30 GMT

మలేషియాలో విషాదం చోటు చేసుకుంది. సింక్ హోల్ లో పడి తెలుగు మహిళ అదృశ్యమైంది. శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి నడుస్తూ వెళుతుండగా పేవ్ మెంట్ పై ఉన్న గుంటలో పడిపోయింది. ఆమె నడుస్తున్న సమయంలోనే పేవ్‌మెంట్ కుప్పకూలింది. 26 అడుగుల లోతు ఏర్పడింది. మలేషియా దేశంలోని కౌలాలంపూర్ లోని డాంగ్ వాంగీ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసకుంది.

గత రెండు నెలలుగా...
విజయలక్ష్మి తన కుటుంబంతో కలసి మలేషియాలో ఉంటున్నారు. ఆమెకు భర్త ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబంతో కలసి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే కౌలాలంపూర్ ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగి మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి ఆమెను వెతికే ప్రయత్నం చేశారు. అయితే విజయలక్ష్మి కనిపించలేదు. ఈరోజు ఉదయం కూడా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమయింది. అయితే కింద గుంటలో ఉన్న నీటితో విజయలక్ష్మి కొట్టుకుపోయి ఉండవచ్చని కౌలాలంపూర్ చీఫ్ రుస్ది మొహ్మద్ తెలిపారు. మలేషియాలో రెండు నెలల నుంచి విజయలక్ష్మి ఉంటున్నారు. విజయలక్ష్మి భారత్ కు తిరిగి రావాల్సిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Tags:    

Similar News