ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ట్రెజరీ ఉద్యోగులు
ఉద్యోగుల జీతభత్యాల బిల్లులను తాము చెల్లించలేమని ట్రెజరీ ఉద్యోగుల సంఘం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది
ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల జీతభత్యాల బిల్లులను తాము చెల్లించలేమని ట్రెజరీ ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులను రూపొందించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తాము పాటించలేమని పేర్కొంది.
జీవో రద్దు వరకూ....
పీఆర్సీపై ప్రభుత్వం జీవో రద్దు చేసేంత వరకూ తాము జీతభత్యాల బిల్లులను చూడబోమని పేర్కొంది. జీతభత్యాలను మినహాయించి మిగిలిన బిల్లులను తయారు చేయడంలో తాము ప్రభుత్వానికి సహకరిస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొంది. పీఆర్సీ జీవో రద్దు తర్వాతనే ఉద్యోగుల జీత భత్యాలను చెల్లిస్తామని, తమ ఉద్యోగులపై ఎలాంటి వత్తిడి తేవద్దని ఆర్థిక శాఖకు రాసిన లేఖలో కోరారు.