శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి 13 నుంచి 17 వరకూ ఆర్జిత సేవలు రద్దు

శ్రీవారి భక్తులకు టిటిడి ఓ ప్రకటన చేసింది. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకూ ఐదురోజుల పాటు తిరుమలలో శ్రీవారి..

Update: 2022-03-10 11:57 GMT

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి దర్శనార్థం వచ్చే శ్రీవారి భక్తులకు టిటిడి ఓ ప్రకటన చేసింది. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకూ ఐదురోజుల పాటు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టిటిడి ఆర్జిత సేవలను రద్దు చేసింది.

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఆర్జిత సేవలైన సహస్ర దీపాలంకార సేవను మార్చి 13, 14వ తేదీల్లో, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను మార్చి 15,16,17 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గ్రహించి, టిటిడి కి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
తెప్పోత్సవాలను ఐదు రోజుల పాటు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.


Tags:    

Similar News