గదుల అద్దె పెంపు వివాదంపై.. టీటీడీ వివరణ ఇలా..

లడ్డూ ప్రసాదాల విషయంలోనూ భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. మీడియాలో వస్తోన్న ఈ వార్తలపై టీటీడీ స్పందించింది.

Update: 2023-01-12 08:17 GMT

కలియుగ దైవంగా కొలిచే.. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతి నిత్యం వేలమంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి.. మొక్కులు చెల్లించుకుని, దర్శనం చేసుకుని మళ్లీ తిరుగుపయనమవ్వాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది. అందుకే సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ.. తిరుమలలో స్టే చేసేందుకు కొన్ని గదులను కేటాయించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. రోజుకు రూ.100, రూ.150 అద్దె చెల్లించే గదులను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ అద్దె గదుల రేట్లను అమాంతం పెంచడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రూ.150 ఉండే అద్దెను ఒక్కసారిగా రూ.1700 చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లడ్డూ ప్రసాదాల విషయంలోనూ భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. మీడియాలో వస్తోన్న ఈ వార్తలపై టీటీడీ స్పందించింది. భక్తుల సూచనల మేరకు వసతి గృహాల్లో మార్పులు, చేర్పులు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే మెరుగైన వసతులను కల్పించామని, అందుకు అనుగుణంగానే.. అద్దెను పెంచినట్లు తెలిపింది. 30 ఏళ్ల క్రితం నిర్ణయించిన అద్దెనే ఇప్పటి వరకు వసూలు చేశామని తెలిపారు. గదులను ఆధునికీకరించి ఏసీ, కొత్త ఫర్నీచర్, గీజర్లు ఏర్పాటు చేశాకే అద్దె పెంచామని వివరణ ఇచ్చారు.
వసతి సౌకర్యాల కల్పన ఆధారంగా నారాణయగిరి గెస్ట్ హౌస్ లో రూ.150 ఉన్న అద్దెను రూ.1700లకు .. అలాగే స్పెషల్ టైప్ కాటేజీల అద్దె రూ.750 నుంచి రూ.2,200 లకు పెంచామని పేర్కొన్నారు. సాధారణ భక్తులు బుక్ చేసుకునే రూ.50, రూ.100 గదుల అద్దెలను పెంచలేదని వివరించారు.



Tags:    

Similar News