తిరుమల ఎల్ఈడీ స్క్రీన్ పై సినిమా పాటలు.. వివరణ ఇచ్చిన ధర్మారెడ్డి
తాజాగా టిటిడి అదనపు ఈఓ ఈ ఘటనపై స్పందించారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై శుక్రవారం సినిమా పాటలు ప్రత్యక్షం కావడంపై ఆయన వివరణ..
తిరుపతి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లలో నిత్యం శ్రీవేంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. కానీ ఏప్రిల్ 22, శుక్రవారం మాత్రం తిరుమలలో ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారమయ్యాయి. దానిని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. పెద్ద దుమారమే రేగింది. శ్రీవారి భక్తులు సహా ఏపీ విపక్ష నేతలు ఈ ఘటనపై మండిపడ్డారు. తిరుమలలో అసలేం జరుగుతుందంటూ సోము వీర్రాజు కూడా ఫైర్ అయ్యారు.
తాజాగా టిటిడి అదనపు ఈఓ ఈ ఘటనపై స్పందించారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై శుక్రవారం సినిమా పాటలు ప్రత్యక్షం కావడంపై ఆయన వివరణ ఇచ్చారు. టిటిడి బ్రాడ్ కాస్ట్ ఉద్యోగి స్నేహితుడి కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. కాగా.. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు ప్రసారం కావడాన్ని తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించినట్టు చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం బ్రాడ్‌కాస్టింగ్ ఉద్యోగి స్నేహితుడే ఇందుకు కారణమని తేలిందన్నారు.
టిటిడి బ్రాడ్ కాస్ట్ ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్ కాస్ట్ గదిలోకి తీసుకెళ్లి.. అతడిని అక్కడే ఉంచి వేరే పనిపై వైకుఠం 2 వరకూ వెళ్లిన సమయంలో ఈ తప్పిదం జరిగిందన్నారు. బ్రాడ్‌కాస్ట్ గదిలో ఉన్న అతడి స్నేహితుడు అక్కడ ఉన్న రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో సినిమా పాటలు ప్రసారమైనట్టు ధర్మారెడ్డి వివరించారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి తెలిపారు.