అలిపిరి నడకమార్గంపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల అలిపిరి నడకమార్గంలో లక్షిత అనే బాలికను చిరుతపులి బలికొంది. ఈ నేపథ్యంలో టీటీడీ
తిరుమల అలిపిరి నడకమార్గంలో లక్షిత అనే బాలికను చిరుతపులి బలికొంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. ఈ హై అలర్ట్ జోన్ లో ప్రతి 100 మంది భక్తులను ఓ బృందంగా పంపిస్తారు. భక్తులకు ముందు భాగంలోనూ, వెనుక భాగంలో రోప్ లతో రక్షణ కల్పిస్తారు. ఈ బృందానికి పైలెట్ గా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది.
టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేశ్, శశికళ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మార్గంలో కాలినడకన బయల్దేరింది. బాలిక లక్షిత ముందు నడస్తుండగా, చిరుత ఒక్కసారిగా దాడి చేసి బాలికను నోటకరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. లక్షిత మృతదేహం ఈ ఉదయం నరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో కనిపించింది.