శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల
దేవాలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.120.24 కోట్లు ఖర్చు చేసినట్లు టిటిడి వెల్లడించింది.
శ్రీవాణి ట్రస్టుపై తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేతపత్రం విడుదల చేసింది. ట్రస్టుకు వచ్చిన నిధులు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, వ్యయాలను టిటిడి వెల్లడించింది. మే 31, 2023 వరకు శ్రీవాణి ట్రస్టుకు రూ.861 కోట్ల నిధులు వచ్చాయని తెలిపింది. వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని వివరించింది. ఎస్ బీ ఖాతా కింద ప్రతిరోజూ వచ్చే నగదు రూ.139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నట్లు పేర్కొంది. డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.36.50 కోట్లు వచ్చినట్లు తెలిపింది.
దేవాలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.120.24 కోట్లు ఖర్చు చేసినట్లు టిటిడి వెల్లడించింది. ఏపీతో సహా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించినట్లు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణాలకు రూ.227.30 కోట్ల కేటాయింపులు చేసినట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా నేరుగా టిటిడిని సంప్రదించవచ్చని సుబ్బారెడ్డి వెల్లడించారు. కొందరు రాజకీయ లబ్ధికోసం ట్రస్ట్ పై నిరాధార ఆరోపణలు చేశారని, న్యాయ సలహా తీసుకుని అలాంటి ఆరోపణలు చేసినవారిపై కేసులు పెడతామన్నారు. టిటిడిలో ఎంతటివాడైనా తప్పు చేయడానికి భయపడతారని, ఇక్కడ తప్పు చేసి ఎవరూ తప్పించుకోలేరని, అంతటి సాహసం ఎవరూ చేయలేరని చైర్మన్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.