తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ
త్వరలోనే తిరుమలకు అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు ధర్మారెడ్డి వివరించారు. ఇది ఎంతో ఖరీదైన..
హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇటీవల.. డ్రోన్ ఎగురవేసి శ్రీవారి ఆలయం వీడియో ఫుటేజీని చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో.. టీటీడీపీ విమర్శలు వెల్లువెత్తాయి. తిరుమలలో భద్రత కొరవడిందని, అంతా డొల్లేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్రోన్ ఎగురవేయడంపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. భద్రతపై ఎక్కడా రాజీపడబోమని, తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని అన్నారు. డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు అయిందని వెల్లడించారు.
అలాగే.. త్వరలోనే తిరుమలకు అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు ధర్మారెడ్డి వివరించారు. ఇది ఎంతో ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం అయినప్పటికీ, భద్రతకే తొలి ప్రాధాన్యతనిస్తూ.. ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై.. ఎవరైనా తిరుమలలో డ్రోన్లు ఎగరేస్తే, ఆ డ్రోన్లలో ఉండే కెమెరాలు పనిచేయకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుందని వివరించారు. కాగా.. కొందరు అత్యుత్సాహంతోనే శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించినట్టు తెలుస్తోందని, ఆ వీడియోను ల్యాబ్ కు పంపామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు వెల్లడించారు.