volunteers : వాలంటర్లకు గుడ్ న్యూస్ ఎప్పుడంటే?
ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటి పోయింది. అయితే ఇప్పటి వరకూ వాలంటీర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటి పోయింది. అయితే ఇప్పటి వరకూ వాలంటీర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారిని కొనసాగిస్తారా? లేదా? అన్న దానిపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థను అసలు ఉంచాలా? వద్దా? అన్న దానిపై అధికార పార్టీలో పెద్దయెత్తున చర్చ సాగుతుంది. వాలంటీర్ల వల్ల ఏం ఉపయోగం అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు వారి వేతనాన్ని ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు పెంచుతానని కూడా తెలిపారు.
పింఛన్ల పంపిణీని...
ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛనును వాలంటీర్ల ద్వారానే పంచుతారని భావించారు. కానీ జులై, ఆగస్టు నెల పింఛనును సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితోనే ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఉదయం తెల్లవారు జాము నుంచే గత ప్రభుత్వం మాదిరిగానే ఏ మాత్రం తేడా లేకుండా పంపిణీ జరిగింది. పింఛన్ల పంపిణీ ప్రక్రియ కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేశారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై అధికారా పార్టీలో తర్జన భర్జన జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్లను నియమించింది. వారికి ఐదువేల జీతం నెలకు గౌరవంగా ఇచ్చింది. అయితే అందరూ వైసీపీ సానుభూతి పరులనే నియమించారన్న విమర్శలున్నాయి.
ఎన్నికల సమయంలో....
ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఉపయోగపడతారనుకుంటే వారిని ఎన్నికల కమిషన్ ఎన్నిల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఈ సందర్భంగా వైసీపీకి కొందరు అనుకూలురైన వాలంటీర్లు రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేయని వాలంటీర్లు కూడా ఉన్నారు. వారంతా తమను కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను కంటిన్యూ చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలను కలసి వినతి పత్రాలు ఇస్తున్నారు. అయితే నెలకు పదివేలు ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్న వాదన అధికార పార్టీలో ఉంది. కానీ మంత్రులు మాత్రం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడో నెల కూడా వస్తుంది. సెప్టంబరు నెల పింఛను కూడా సచివాలయ సిబ్బంది చేతనే పంపిణీ చేసే ఏర్పాట్లు చేసుకుంటుండటంతో ఇక వాలంటీర్ల వ్యవస్థపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.