పిల్లి కరిచి ఇద్దరు మహిళల మృతి
పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పిల్లి కరిచిన రెండు నెలల తర్వాత ఇద్దరు మరణించారు;
విజయవాడ : పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పిల్లి కరిచిన రెండు నెలల అనంతరం ఇద్దరు మహిళలు ఒకేరోజు మరణించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడ దళితవాడకు చెందిన రిటైర్డ్ కండక్టర్ సౌలి భాగ్యారావు భార్య కమలను, అదే గ్రామంలో ప్రయివేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిలను రెండు నెలల క్రితం పిల్లి కరిచింది.
అనారోగ్యం పాలవ్వడంతో....
పిల్లి కరిచిన వెంటనే వైద్యుల సూచనల మేరకు వీరిద్దరూ టీటీ ఇంజక్షన్లు చేయించుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా నాలుగు రోజుల క్రితం ఇద్దరు మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆసుపత్రిలో చేరిన వారిద్దరూ మరణించారు. ఇద్దరూ పిల్లి కరవడం వల్లనే మృతి చెందినట్లు వెైద్యులు తెలిపారు.