Rajya Sabha : రాజ్యసభకు చంద్రబాబు ఎంపిక చేసేది వారిద్దరినేనా?

రాజ్యసభకు ఇద్దరు వైసీపీ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలతో ఉప ఎన్నికలు జరగనున్నాయి

Update: 2024-08-30 05:44 GMT

రాజ్యసభకు ఇద్దరు వైసీపీ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రాజీనామాలతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. రెండు స్థానాలు ఖాళీ అయినట్లు రాజ్యసభ బులిటెన్ కూడా విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటానికి కొంత సమయం పడుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎన్నికలు ఎప్పుడనేది తెలియనుంది. ఎమ్మెల్యేలు ఇద్దరు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బలాబలాలను బట్టి ఎన్టీఏ కూటమికి రెండు స్థానాలు దక్కనున్నాయి.

మోపిదేవిని ఎమ్మెల్సీగా...
వైసీపీకి కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే ఉండటంతో అది పోటీ చేసే అవకాశం కూడా లేదు. ఏకగ్రీవంగా ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పుడు రాజ్యసభ పదవులకు చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై మూడు పార్టీల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. మోపిదేవికి జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు. ఆయన రేపల్లె నియోజకవర్గంలోనే తన రాజకీయాలను కొనసాగించాలని భావిస్తున్నారు. అందుకని ఆయన రాజీనామా చేసినా మరోసారి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేదు.
క్లారిటీ లేదు...
ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బీదమస్తాన్‌రావుకు ఎలాంటి హామీని అధినాయకత్వం ఇచ్చిందో తెలియదు. ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్ రాజకీయాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. అయితే ఆయన పారిశ్రామికవేత్త కావడం, గతంలో టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేయడం, గతంలో నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఉండటం వంటి కారణాలతో ఆయనను తిరిగి రాజ్యసభకు చంద్రబాబు ఎంపిక చేసే అవకాశముందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. బీద మస్తాన్ రావు పేరును రాజ్యసభకు ఎంపిక చేయకపోతే మాత్రం మరొకరికి ఆ బాధ్యతలను అప్పగించే అవకాశముంది.
సీనియర్ నేతలు...
కానీ ఈ రెండు స్థానాలకు టీడీపీలోని రెండు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కూటమిలో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలను టీడీపీ యే తీసుకోనుంది. అందువల్ల సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అశోక్ గజపతి రాజుకు గత ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వలేదు. క్షత్రియ సామాజికవర్గానికి రాష్ట్ర కేబినెట్ లో స్థానం కూడా కల్పించలేకపోయారు. దీంతో అశోక్ గజపతి రాజుకు ఒక పేరు ఖాయమని తెలుస్తోంది. మరొక పదవి యనమల రామకృష్ణుడును రాజ్యసభకు పంపితే ఆయన ఢిల్లీలో రాష్ట్ర అవసరాల కోసం కొంత ఉపయోగపడతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే యనమల ఎమ్మెల్సీగా ఉన్నారు. దానికి రాజీనామా చేయించి రాజ్యసభకు చంద్రబాబు ఎంపిక చేసే ఛాన్స్ ఉందంటున్నారు.


Tags:    

Similar News