ఎయిమ్స్ అధికారులపై ఆగ్రహం...ఇలాగే ఉంటే?
మంగళగిరి ఎయిమ్స్ ను కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు ముచ్చెటమలు పట్టించారు.
మంగళగిరి ఎయిమ్స్ ను కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు ముచ్చెటమలు పట్టించారు. ఆమె ఎయిమ్స్ లోని అవుట్ పేషెంట్ విభాగం నుంచి పరీక్షల చేసే విభాగాల వరకూ నిశితంగా పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. దక్షిణాదిన ఏర్పాటు చేేసిన ఎయిమ్స్ లో అధికారుల నిర్లక్ష్యం కనపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. రోగుల నుంచి అన్ని వివరాలను తెలుసుకున్న కేంద్ర మంత్రి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అనేక సమస్యలను...
నీటి సమస్య ఉందా? అని ప్రశ్నించారు. దీనికి నీళ్లు నమిలిన అధికారులు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని అధికారులు చెప్పడంతో, మళ్లీ సీఎం కార్యాలయాన్ని ఫాలోఅప్ చేశారా? అంటే ఆమె నిలదీశారు. ఎయిమ్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ల్యాబ్ రిపోర్టులు ఎప్పుడిస్తున్నారని ప్రశ్నించగా, గంటలో ఇస్తున్నామని చెప్పారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఒకరోజు పడుతుందని, అంత సమయం ఎందుకు తీసుకుంటున్నారని అధికారులను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్వహణకు నిధులు పంపుతున్నా సరైన దిశగా నడవడం లేదని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.