మళ్లీ వాయిదానే
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి తీర్పు రేపటికి వాయిదా పడింది.
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10..30 గంటలకు తీర్పు చెప్పనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో రాజమండ్రి జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేపటితో ఆయన రిమాండ్ కూడా పూర్తి కానుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నిన్నంతా ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈరోజుకు తీర్పు చెబుతారని భావించినా రేపటి వాయిదా పడటంతో కస్టడీ టెన్షన్ మాత్రం కొనసాగుతుంది.
ఇరు వర్గాల వాదనలు...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును తమకు కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, విచారణ మరింత లోతుగా చేస్తేనే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయని సీఐడీ తరుపున న్యాయవాదులు వాదించారు. అయితే 24 గంటల పాటు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించారని, కొత్తగా విచారణలో బయటపడే అంశాలేవీ ఉండే అవకాశం లేదని, అందువల్ల కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరుపున న్యాయవాదులు వాదించారు. అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబును విచారణతో వేధించారని కూడా బాబు తరుపున న్యాయవాదులు తెలిపారు.