Vijayawada : గుండెను పిండేసే దృశ్యాలు... పిల్లాపాప, తట్టాబుట్టాలతో సొంత గూటిని వదిలేసి?

విజయవాడ సింగ్ నగర్ ఖాళీ అవుతుంది. మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో సింగ్ నగర్ వాసులు భయపడిపోతున్నారు.

Update: 2024-09-05 04:16 GMT

విజయవాడ సింగ్ నగర్ ఖాళీ అవుతుంది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో సింగ్ నగర్ వాసులు భయపడిపోతున్నారు. తమ సొంత ఇళ్లను వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. బంధువుల ఇళ్లలో తలదాచుకునేందుకు కొందరు, మరికొందరు వేరే ప్రాంతాలకు వెళ్లి కొన్ని రోజులు ఉందామని భావిస్తూ సింగ్ నగర్ ను వదిలేస్తున్నారు. ప్రస్తుతం సింగ్ నగర్ లో ఉండలేని పరిస్థితి. మరోసారి బుడమేరు పొంగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఉన్న నీరు ఇంకా పోలేదు. ఇంకా సింగ్ నగర్ లో మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు ఉంది. అది ఎక్కడకు పోకుండా ఉండటంతో నడవటానికి వీలవ్వడంతో జనంఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా...
నాలుగు రోజుల నుంచి ఆహారం, మంచినీళ్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారింది. అందుకే వేలల్లో జనం సొంత గూటిని విడిచి వేరే ప్రాంతానికి వెళుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచి వేస్తున్నాయి. గుండను పిండేస్తున్నాయి. పసిపిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితి. అలాగని ప్రభుత్వం సాయం చేయడం లేదనికాదు. పుష్కలంగా పంపిస్తున్నా అవి అందాల్సిన వారికి అందడం లేదు. మధ్యలో కండబలమున్న వాళ్లు ఎగరేసుకుపోతున్నారు. ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి దయనీయంగా తయారయింది. బయటకు వెళ్లలేరు. ఇంటికి ఆహారం దరి చేరలేదు. డ్రోన్లలో ఆహారం పంపిణీ జరిగినా పూర్తి స్థాయిలో జరగలేదు.
బతికుంటే చాలు అన్నట్లు...
ఎంత స్థాయి అంటే వర్షం పడితే ఆ నీరును పట్టుకుని తాగుతూ వాటినే మరుగుదొడ్లకు ఉపయోగించుకునే వరకూ వచ్చిందంటే అంతకంటే దయనీయమైన స్థితి ఏ ఒక్కరికి రాకూడదనుకుంటారు. ఒకవైపు ఆకలి, మరొక వైపు దాహం.. ఇలా ఎన్ని గంటలు...? దానికి ఫుల్‌స్టాప్ పడకపోయే.. నాలుగు రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాకపోయె. ఇక ఏం చేయాలి? ముందు బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న సామెతను గుర్తుకు తెస్తూ కట్టుబట్టలతో పయనమయ్యారు. వృద్ధులు, పిల్లలు ఇలా అందరూ కలసి నడిచి వెళుతుంటే కన్నీరు ఆగడం లేదు. ఇంతటి దయనీయమైన పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు.
నరకం అంచు వరకూ...
ఇక విద్యుత్తు సౌకర్యం కూడా లేకపోవడంతో నాలుగు రోజుల నుంచి నరకం అంచు వరకూ వెళ్లి బయటపడ్డామంటూ బాధితులు చెబుతున్నారు. కొందరు ట్రాక్టర్లలోనే తిరుగుతూ భోజనం దొరికిన చోట ఆగుతూ తమ కడుపును నింపుకుంటున్నారు. బంధువులు లేని వాళ్లు ఏం చేయలేక కనీసం ఇళ్లలో ఉండే కంటే మెరక ప్రాంతంలో ఉంటే కాస్త నీరు, భోజనం దొరుకుతుందేమోనని, తమ జీవుడు బతుకుతాడన్న ఆశ వారిలో కనిపిస్తుంది. అందుకే వరద నీరు తగ్గడంతో జనంతో సింగ్ నగర్ వంతెన కిటకిటలాడిపోతుంది. విలువైన వస్తువులను మాత్రమే (మోయగలిగినవి) వారు ఇంటి నుంచి బయటపడ్డారు. మొత్తం మీద సింగ్ నగర్ మూడు వంతులు ఖాళీ అయింది.


Tags:    

Similar News