విశాఖలో ఆసక్తి రేపిన జీవీఎల్ హోర్డింగ్

విశాఖపట్నంలో అనేక చోట్ల టీమ్ జీవీఎల్ పేరుతో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.

Update: 2023-08-31 12:51 GMT

విశాఖలో ఆసక్తి రేపిన జీవీఎల్ హోర్డింగ్

విశాఖపట్నంలో అనేక చోట్ల టీమ్ జీవీఎల్ పేరుతో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రారంభించబోయే ఆదిత్య L1 ప్రాజెక్ట్ విజయాన్ని కాంక్షిస్తూ ‘టీం జీవీఎల్ ’ పేరుతో జగదాంబ సెంటర్, రైల్వే స్టేషన్, మురళినగర్ తో పాటు అనేక ప్రధాన కూడళ్లలో ప్రత్యేక హోర్డింగులు ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ సారథ్యంలో చంద్రయాన్ ఘన విజయం ఆదిత్యా-L1 ప్రయోగ విజయానికి కూడా మార్గం సుగమం కావాలని కాంక్షిస్తూ ‘మోడీ 4 వరల్డ్’, ‘జీవీఎల్ 4 వైజాగ్’ ఆంటూ వినూత్న ప్రచారం చేపట్టారు. బీజేపీ నుంచి పురంధేశ్వరి పార్లమెంటుకు పోటీ చేస్తారనే.. ఆయన ముందుగానే ప్రచారం మొదలు పెట్టారని టాక్ ఆఫ్ ది టౌన్.

2009లో పురుంధరేశ్వరి విశాఖ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఆమె రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే అప్పుడు ఆమెకు వచ్చింది కేవలం 33 వేల ఓట్లు మాత్రమే. 2019 తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పలు రాష్ట్రాల బాధ్యతలు, మహిళా మోర్చా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడంతో విశాఖపై ఆమె దృష్టి సారించిన సందర్భాలు చాలా తక్కువే. దీంతో ఇదే మంచి సమయమూ.. అంటూ జీవీఎల్ హోర్డింగ్ లు పెట్టేశారు. ఇప్పటికే తాను విశాఖ నుంచి పోటీ చేసేందుకు అధిష్టానం అనుమతి తీసుకుని వాళ్ళ సూచన మేరకే పని చేస్తున్నట్టుగా జీవీఎల్ చెబుతుండటం కొసమెరుపు.

గతంలోనూ జీవీఎల్ వర్సెస్ పురంధేశ్వరి ట్విటర్ వార్

వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా జీవీఎల్ ట్వీట్ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహాలే కనిపిస్తాయని వాళ్ళిద్దరూ గొప్ప నాయకులే కానీ వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ట్వీట్ చేశారు. దానిపై పురందేశ్వరి స్పందిస్తూ, ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లు ఇద్దరూ సంక్షేమ ప్రధాతలు అనీ, లెజెండరీ నాయకులని, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత జీవీఎల్ కు లేదన్నట్టు ట్విట్టర్ వేదికగానే స్పందించారు. అయితే జివీఎల్ దానిపై స్పందించలేదు. కానీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అప్పట్లో బహిర్గతమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోందని హోర్డింగ్ ల ద్వారా తెలుస్తోంది.

Tags:    

Similar News