Viveka Case: వివేకా హత్య కేసులో ఊహించని పరిణామం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడి రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీపై ఛార్జీషీట్ దాఖలైంది. శుక్రవారం పులివెందుల కోర్టులో పులివెందుల అర్బన్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఛార్జీషీట్ ను కోర్టులో సమర్పించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో కొంత మంది పేర్లు చెప్పాలని బెదిరించారని, ఒత్తిడి తీసుకొచ్చారంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ పై వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచి సీబీఐ క్యాంపు కార్యాలయంలో, తన కుమారుల ముందే తీవ్రంగా కొట్టారని.. ఈ కేసులో తనను తప్పుడు సాక్ష్యం చెప్పమంటూ వివేకా కుమార్తె, అల్లుడుతో పాటు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 2021 నవంబర్‌లో పులివెందుల పోలీసులకు ఈ ఫిర్యాదును ఇచ్చారు. తన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవటంతో పులివెందుల కోర్టును ఆశ్రయించారు కృష్ణారెడ్డి. ఆయన పిటిషన్ పై విచారించిన కోర్టు కేసు నమోదుకు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.