మళ్లీ మొదలయిన పోలవరం వార్
పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వార్ ముదరుతున్నట్లే కనిపిస్తుంది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వార్ ముదరుతున్నట్లే కనిపిస్తుంది. ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే పోలవరం ఎత్తు తగ్గించాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. పోలవరం ఎత్తును పెంచుకుంటూ పోతే తెలంగాణకు ముప్పు ఏర్పడుతుందని ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వరదకు పోలవరం ప్రాజెక్టు కూడా ఒక కారణమని అంటున్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలతో వివాదం మరింత తీవ్రమయ్యేలా కన్పిస్తుంది. భద్రాచలం పట్టణం వరద నీటిలో మునిగిపోవడానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణమని చెప్పారు.
ఎత్తు పెంచితే...
ప్రాజెక్టు ఎత్తు మరింత పెంచితే తమ ప్రాంతానికి ముప్పు ఏర్పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. విలీన మండలాలను వెంటనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటులోనూ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు. ఏపీ ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణ పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారని వారు చెబుతున్నారు. పోలవరం ఎత్తును తగ్గించకపోతే ఆందోళన మరింత ఉథృతం చేయనున్నామని ఖమ్మం ప్రాంత ఎమ్మెల్యేలు అల్టిమేటం ఇచ్చారు. భద్రాచలం ఆనుకుని ఉన్న గ్రామాలు నీట మునగడానికి కారణం కూడా పోలవరం ప్రాజెక్టు అని వారంటున్నారు. ఆదివాసీ ప్రజలు నష్పపోతారంటున్నారు.