తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలకు హై అలర్ట్

రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణుల ప్రభావం

Update: 2023-07-24 02:17 GMT

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణుల ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పాటు నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు.. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు.

తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వానలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.


Tags:    

Similar News