తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Update: 2023-06-07 01:57 GMT

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఇక పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. 8-11వ తేదీ వరకూ పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని. కొన్ని జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు ఎండలు, వేడిగాలులు వీస్తుంటే.. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు.. గురువారం 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కూడా పడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. బుధవారం కూడా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, యానాం, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడవచ్చని.. మిగిలిన జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ రాత్రికి తుఫాన్‌గా మారింది. దీనికి బంగ్లాదేశ్‌ సూచించిన ‘బిపర్జాయ్‌’ అని పేరు పెట్టారు. తుఫాన్‌ మరో తొమ్మిది రోజులు అరేబియాలో ఉత్తరంగా కొనసాగే క్రమంలో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.


Tags:    

Similar News