మరింత ఆలస్యమవుతున్న తొలకరి.. ఆందోళనలో అన్నదాత
మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రం అకాలవర్షాలు కురిసి.. మామిడి, మిరప, మొక్కజొన్న, బొప్పాయి, అరటి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి.
జూన్ తొలివారంలోనే పలుకరించాల్సిన తొలకరి.. మూడో వారంలో కూడా రాలేదు. నైరుతి నెమ్మదించడంతో రైతులు తొలకరి సాగుకు ముందుకి రాలేదు. వర్షాలు సమయానికి రాకపోగా.. భానుడు కూడా భగభగమంటున్నాడు. ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. దీనికితోడు అనధికార విద్యుత్ కోతలు. పేరుకి 24 గంటలు విద్యుత్ అని ప్రకటనలు చేసి.. వేళ పాళ లేకుండా అర్థరాత్రుళ్లు కూడా కరెంట్ కట్ చేస్తున్నారు.
వర్షాలు సమయానికి కురిసి ఉంటే.. ఈ సమయానికి పంట భూములు పచ్చగా కళకళలాడుతుండేవి.వర్షాలు ఆలస్యం కావడంతో.. రైతులు విత్తనాలు వేయలేదు. చినుకు పడితే భూముల్ని దున్ని విత్తనాలు జల్లాలని ఎదురుచూస్తున్న వారందరికీ వానజాడ కరువైంది. ఎదురుచూసే కొద్దీ తొలకరి వెనక్కి వెళ్తుండటంతో.. రైతన్న ఆందోళన చెందుతున్నాడు. మృగశిర కార్తెలోనూ 47 డిగ్రీల ఎండ.. ఉష్ణమండలాన్ని తలపిస్తోంది. నీటి వసతి ఉన్న ప్రాంతంలో మాత్రం పంటలు వేశారు. జూన్ లో ఈ ఏడాది ఇప్పటి వరకూ 77 శాతం తక్కువ వర్షం కురిసింది.
మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రం అకాలవర్షాలు కురిసి.. మామిడి, మిరప, మొక్కజొన్న, బొప్పాయి, అరటి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. అప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన మోఖా తుపాను ఇందుకు ఒక కారణం. కాగా.. జూన్ 11న శ్రీహరికోట వద్ద రుతుపవనాలు ఎంటరయ్యాయన్న మాటే గానీ.. బిపోర్ జాయ్ తుపాను కారణంగా వాటిలో కదలిక లేదు. వేడిగాలులు పెరిగాయి. ఉక్కపోత పెరిగింది. ఉష్ణోగ్రతలూ పెరిగాయి. మరో మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. నిన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవాలంటే జులై తొలివారం రావాల్సిందేనంటున్నారు.