నన్ను 'గన్నవరం' ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి.. లేదంటే..

గన్నవరంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలతో యార్లగడ్డ వెంకట్రావు సమావేశమ‌య్యారు

Update: 2023-08-14 05:26 GMT

గన్నవరంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలతో యార్లగడ్డ వెంకట్రావు సమావేశమ‌య్యారు. గన్నవరంలోని ఎస్ఎమ్ కన్వెన్షన్ హాల్ లో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కీల‌క కామెంట్స్ చేశారు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఎంతో మంది ఇక్కడకు రావడానికి చూసినా.. కొంతమంది రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. 2019లో రాజకీయాల‌పై మక్కువతో అమెరికా నుండి వచ్చాన‌ని.. యార్లగడ్డ చారిటబుల్ ట్రస్టు పెనమలూరులో వున్నా.. గన్నవరంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది.. గన్నవరం వెళ్ళమని జగన్ చెప్పడంతో వచ్చాను. 2017 వరకు గన్నవరం విమానాశ్రయం తప్ప ఎవ్వరూ నాకు తెలియదు. కానీ 2019 ఎన్నికల్లో పోటీ తర్వాత పెద్ద కుటుంబాన్ని జగన్ ఇచ్చారని.. దుట్టా రామచంద్రరావు నియోజకవర్గ నాయకులను పరిచయం చేసారని పేర్కొన్నారు.

నియోజ‌క‌వ‌ర్గాన్ని 1983కి ముందు పుచ్చలపల్లి సుందరయ్య సీపీఎంకి కంచుకోటగా నిలిపారన్నారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే గెలిచిందని.. రెండు సార్లు ఇండిపెండెంట్ లను గెలిపించిన ఘనత గన్నవరం నియోజకవర్గ ప్రజలదన్నారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో తొక్కని గడప లేదు.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించుకున్నాం.. 270 ఓట్లు తేడాతో ఓడిపోయానని తెలిపారు. 2019 ఎన్నికల్లో త‌న‌కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆనందపడాలో.. వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్నాడని బాధ‌ప‌డాలో తెలియట్లేద‌న్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నామినేటెడ్ పదవులు, వాలంటీర్లును నియమించానన్నారు. ఇద్దరు మంత్రులు వంశీని వెంటపెట్టుకొని సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయమని సీఎం జగన్ చెప్పారు. గద్దె రామ్మోహన్ లాంటి సౌమ్యంగా వుండే వ్యక్తితో అయితే పని చేసేవాడినన్నారు.

ఆ తర్వాత సహకార బ్యాంకు చూసుకోమని చెప్పాడు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ కోసం దుట్టా రామచంద్రరావు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని జ‌గ‌న్‌కు చెప్పానన్నారు. రాజకీయాల్లో ఉన్నంతసేపు గన్నవరం నియోజకవర్గంలో ఉంటా.. ఇక్కడే పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేస్తే ఎమ్మెల్సీ ఇస్తారు కదా అని కొంతమంది నాయకులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పదవి కోసం కలవను అని చెప్పిన‌ట్లు తెలిపారు.

నియోజకవర్గంలో 104 గ్రామాల్లో పాదయాత్ర చేసేందుకు యువతే కారణమ‌న్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో బీఫామ్ లు ఎమ్మెల్యే వంశీకి ఇస్తే ఏ ముఖంతో గన్నవరం రావాలని ప్ర‌శ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులకు అన్యాయం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా నిజమైన వైసీపీ నాయకులకు అన్యాయం జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాకోసం పనిచేసిన వైసీపీ కార్యకర్తలకు ఏమి చేయలేకపోయానని నిస్సాహ‌య‌తను వ్య‌క్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయనని చెప్పిన‌ట్లు తెలిపారు. అన్నం తినేవాడు వైసీపీలో ఉండడు అన్నవాడిని తీసుకునే ముందు తెలియదా అని ప్ర‌శ్నించారు.

గన్నవరంలో జగన్ పాదయాత్ర చేయడం కోసం కష్టపడాల్సి వచ్చిందని స్వయంగా జగన్‌కు చెప్పాన‌ని.. ఎమ్మెల్యే వంశీని తీసుకుంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పి తీసుకున్నా అని జగన్ చెప్పారని.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఏమో కానీ.. గన్నవరం నియోజకవర్గంలో కార్యకర్తలు హోదా పోయిందని కార్య‌క‌ర్త‌ల‌తో అన్నారు. సహకార బ్యాంకు పదవి ఇస్తే అది అభివృద్ధి కోసమే పనిచేశానని తెలిపారు. విజయవాడ ఎంపీ ఇంచార్జ్‌గా వెళ్ళమని అధిష్టానం చెప్పిందని.. కానీ నేను ఆరోజే చెప్పాను.. గన్నవరం నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

వైసీపీలో ఉన్నందుకు నా బంధువులు చాలా మంది దూరమయ్యారన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఎంతో అభిమానించారన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎంపీకి ఇంత మెజార్టీ వచ్చిందా అని ప్ర‌శ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రతి కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నానని తెలిపారు. నా వెంట ఉన్న కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవని తెలుసన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా వెళ్లిపోతాను అని దుష్ప్రచారం చేశారన్నారు.

2014లో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ లాక్కుందని జగన్ చెప్పారని గుర్తుచేశారు. అమెరికా నుండి తీసుకువచ్చి పోటీ చేసిన నిన్ను క్రాస్ రోడ్ లో నిలబెట్టను అని జగన్‌ చెప్పారని కార్య‌క‌ర్త‌ల‌తో అన్నారు. ఎమ్మెల్యే వంశీ.. దుట్టా రామచంద్రరావుని, నన్ను డొక్క చించి డోలు కడతాను అంటే అధిష్టానం ఏమి చేసిందని ప్ర‌శ్నించారు. రాజకీయాల్లో ఎవరికి ఎవ్వరూ భయపడరని అన్నారు. ఎన్ని అవమానాలు పడ్డా ఏనాడు బూతులు తిట్టలేదన్నారు.

23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని.. ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు జరిగిన పాదయాత్రలో జగన్ పదేపదే చెప్పారు. టీడీపీ నుండి వారం రోజులు ముందు వచ్చిన ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని.. అలాంటి అర్హత ఏమి లేదని దుట్టా రామచంద్రరావుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ప్ర‌శ్నించారు.

ఎంతో మంది మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన గడ్డ గన్నవరం. గద్దె, ముద్దరబోయిన‌ల‌ను ఇండిపెండెంట్ గా గెలిపించారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు అన్యాయాన్ని సహించరన్నారు. గన్నవరం నియోజకవర్గ దుస్థితి తెలియజేస్తాం అంటే అపాయింట్మెంట్ దొరకదని అస‌హ‌నం వెలిబుచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ఎల్లలు తెలియవని దుష్ప్రచారం చేశారు. ఈరోజు నియోజకవర్గంలో ప్రతి సందు, గొంది తెలుసు. గన్నవరం నియోజకవర్గంలో ఉండాలో లేదో కార్యకర్తలే చెప్పాలన్నారు.

ఎయిర్ పోర్ట్ ఎదుట రాజశేఖర్ రెడ్డి పేరుతో స్మారక భవనం కట్టాలని చెప్పాను కానీ ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నన్ను గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నా. లేని పక్షంలో నన్ను నమ్మే కార్యకర్తలే నా భవిష్యత్తు నిర్ణయిస్తారన్నారు. గ‌న్నవరం నియోజకవర్గంలోనే పోటీ చేస్తా.. ఇక్కడే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికాని వదిలా, గన్నవరం నియోజకవర్గ ప్రజలను నమ్మానన్నారు. నా రాజకీయ భవిష్యత్తు కార్యకర్తల అభిమానంపై ఉంటుందన్నారు. నేను మీకోసం పనిచేస్తా.. కార్యకర్తలు నాకు అండగా ఉండాలన్నారు. రాజకీయాల్లో ఒంటరిగా ఏమి చేయలేమ‌ని.. గుంపుగా వస్తేనే విజయాన్ని జయిస్తామన్నారు.


Tags:    

Similar News