Ys Jagan : నేడు జగన్ బస్సు యాత్రకు బ్రేక్
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ నేడు బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులోనే ఉండనున్నారు
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ నేడు బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులోనే ఉండనున్నారు. ఈస్టర్ కావడంతో ఆయన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. పార్టీ నేతలతో ఆయన సమావేశమై పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన చర్చించనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులందరితోనూ వైఎస్ జగన్ సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. వారికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేతలతో సమావేశం...
జగన్ బస్సు లోనే ఈ సమావేశం జరిగేలా నేతలు ప్లాన్ చేశారు. ఈ నెల 27న ఇడుపుల పాయ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర వరసగా నాలుగు రోజులు పాటు సాగింది. తొలి రోజు ప్రొద్దుటూరు, రెండో రోజు నంద్యాల, మూడో రోజు ఎమ్మిగనూరు, నాల్గోరోజు గుత్తి సభల్లో ఆయన ప్రసంగించారు. ఈరోజు మాత్రం విరామం ప్రకటించి నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఆయన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.