Ys Jagan : వైఎస్ జగన్ ఆలోచనలేంటి? నేతల్లో నైరాశ్యాన్ని పారదోలరా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తున్నారు.

Update: 2024-10-07 08:32 GMT

ys jagan

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తున్నారు. మళ్లీ మన ప్రభుత్వం గ్యారంటీగా వస్తుందని చెబుతున్నారు. నమ్మకంగా ఉన్న వారికి పదవులు వస్తాయని భరోసా ఇస్తున్నారు. ఈసారి కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన నేరుగానే నేతలకు చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలకు ఈసారి తాను అధికారంలోకి రాగానే తగిన గౌరవంతో పాటు ఆర్థికంగా ఊతమందిస్తామని కూడా అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. ఇవన్నీ మరి నేతలు, ద్వితీయ శ్రేణి లీడర్లు, క్యాడర్ నమ్ముతుందా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.

నేతలు యాక్టివ్ గా లేక...
ఎందుకంటే కార్యకర్త నుంచి నేతల వరకూ తిరిగి యాక్టివ్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఎన్నికల ఫలితలు వచ్చి నాలుగైదు నెలలు మాత్రమే అవుతుంది. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని కొందరు మౌనంగా ఉంటున్నా, మరికొందరు మాత్రం స్పీడ్ అందుకున్నారు. అయితే వైసీపీ నేతల సంఖ్యతో పోలిస్తే రెస్పాండ్ అయ్యేవారు అతి తక్కువ మంది మాత్రమే. అసలుపట్టించుకోని వారు అనేక మంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసలు ఉన్నారో కూడా తెలియకుండా ఉంది. వారంతా పెదవి విప్పడం లేదు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా పెద్దగా దేనికీ స్పందంచడం లేదు. కారణాలు మాత్రం బయటకు రావడం లేదు.
జనంలోకి వెళ్లాల్సిందే...
అయితే నేతలు యాక్టివ్ కావాలంటే జగన్ మళ్లీ తన వెంట ఉన్నారని జగన్ నిరూపించుకోగలగాలి. ఎన్నికల ద్వారా ఆ పని జరిగే ఛాన్స్ లేదు. సో.. ఇక ఒకే ఒక అవకాశం. అది జనంలోకి వెళ్లడం. జనంలో రెస్పాన్స్ చూసి నేతలు కూడా వైసీపీ బలం పెరిగిందని ఒక అంచనాకు వస్తారు. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి మొదలు కాకముందే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నేతలు కూడా కోరుకుంటున్నారు. జనం వెంట తాను ఉన్నానని చెప్పగలగాలి. తాను అధికారంలో చేసిన తప్పులను నిజాయితీగా ప్రజల ముందు అంగీకరించడం మంచిదంటున్నారు. అధికారులు, కొందరి నేతల కోటరీ మధ్య ఉండిపోయిన జగన్ తక్షణ కర్తవ్యం ఇప్పుడు ఫీల్డ్ లెవల్ కు వెళ్లడం ఒక్కటే మార్గం. అప్పుడే పార్టీకి మళ్లీ కళ వస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
జిల్లా పర్యటనలకు...
జగన్ జిల్లా టూర్లకు భారీగానే వ్యయం కావచ్చు. అయితే ఆ వ్యయాన్ని పార్టీయే భరించి నేతలపై ఆర్థిక భారం మోపకుండా జనంలోకి జగన్ వెళ్లగలిగితే ప్రజల స్పందన చూసి నేతలతో పాటు క్యాడర్ కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. మన ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశముందన్న అంచనాకు వచ్చేంత వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ నిర్లిప్తత కొనసాగుతుంది. దానిని పోగొట్టే బాధ్యత జగన్ పైనే ఉంది. కేవలం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే ఎప్పటిలాగానే పరిమితమయి, క్యాడర్, ప్రజలకు దూరంగా ఉంటే మాత్రం నేతలు, కార్యకర్తలు యాక్టివ్ అయ్యే అవకాశం మాత్రం లేదన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం. మరి జగన్ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News