Ys Jagan : జగన్ ఇక జూలు విదిల్చనున్నారా? తొలి పర్యటన అక్కడి నుంచేనటగా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు

Update: 2024-10-28 08:30 GMT

ys jagan state wide tour

వైసీపీ అధినేత జగన్ మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కార్యకర్తలతో పాటు నేతలతోనూ తరచూ సమావేశమవుతున్నారు. మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా జగన్ ను కలిసేందుకు నేతలు, ముఖ్య కార్యకర్తలు తరలి వస్తున్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి నిత్యం రోజూ ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేతలు వచ్చి ఆయనను కలిసి వెళుతున్నారు. ఈ సందర్భంగా జగన్ నేతలకు, కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నాలుగు నెలలే అయినందున అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం బాగుండదని ఆయన నేతలతో అంటున్నట్లు చెబుతున్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై ఆయన నిలదీతకు రెడీ అవుతున్నారని తెలిసింది.

డిసెంబరు నెల నుంచి...
అయితే డిసెంబరు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. ప్రతి జిల్లాలో పర్యటించి కార్యకర్తలతో భేటీ కావాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడుల్లో నష్టపోయిన, దెబ్బతిన్న కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో పాటు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గం స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం నియోజకవర్గాలు, జిల్లాల వారీగా కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇన్‌ఛార్జులను నియమించాలని యోచిస్తున్నారు.
ఇచ్చిన హామీలను...
దీంతో పాటు ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై నిలదీత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రాగానే వాటిని మరచిపోయి తమ ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే పింఛన్లలో కోత పెట్టారంటూ ఆయన తన వద్దకు వచ్చిన వారితో అంటున్నారు. పింఛన్లలో కోత పెట్టడమే కాకుండా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత ఇసుక వంటి వాటిపై ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు మరోసారి ప్రజలను ఎలా నమ్మించి మోసం చేశారో చెప్పనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
అక్కడి నుంచే...
తొలుత జగన్ పర్యటన రాయలసీమ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తొలుత పర్యటనలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాయలసీమలో కోల్పోయిన పట్టును తిరిగి నిలబెట్టేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని తెలిసింది. గత ప్రభుత్వంలో ఏంచేశాం? ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దేమిటోపూర్తిగా కార్యకర్తలకు వివరించడమే కాకుండా జారి పోయిన ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకోవడంతో పాటు తనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రాయలసీమ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.


Tags:    

Similar News