Ys Jagan : చూశావా జగన్.. ఇప్పటికైనా అర్థమయిందా? బాబును చూసైనా నేర్చుకోగలవా?
వైసీపీ అధినేత జగన్ ఓటమి నుంచి బయటపడి కొంత పాలన ఎలా చేయాలన్న దాని గురించి అనుభవజ్ఞులైన వారి నుంచి నేర్చుకోవాల్సి ఉంది;
వైసీపీ అధినేత జగన్ ఓటమి నుంచి బయటపడి కొంత పాలన ఎలా చేయాలన్న దాని గురించి అనుభవజ్ఞులైన వారి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. తన తండ్రి వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయన పాలన ఎలా సాగించారో? ఎలా ప్రజలకు చేరువగా ఉండే వాళ్లో జగన్ కు తెలియనిది కాదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను జగన్ దగ్గరుండి చూశారు. ఆయన నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి పాటుపడే వారు. అందుకే వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా అధికారాన్ని అప్పగించారు జనం. ఇటు సంక్షేమంతో పాటు అటు అభివృద్ధిని కూడా పరుగులు తీయించడమే కాకుండా, వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించేందుకు వైఎస్సార్ చేసిన కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, 2009 లో అధికారంలోకి రాగలిగింది.
నేడు జరిగిన పింఛన్ల పంపిణీ...
ఇక ప్రత్యర్థి అయినా.. చంద్రబాబు ను చూసి జగన్ పాలన విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు చూస్తే రాష్ట్రమంతటా పింఛన్ల పంపిణీ జరిగింది. ఇది ఇంటికి వెళ్లి ఇవ్వడం కొత్తగాదు. జగన్ హయాంలో వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇచ్చిందే. అయితే తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లారు. వారికి స్వయంగా పంపిణీ చేశారు. రాష్ట్రమంతటా ఎమ్మెల్యేలను పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యులను చేశారు. అంటే ఎమ్మెల్యేలకు పని అప్పచెప్పడమే కాదు.. వారిని ప్రజలకు చేరువయ్యేలా చంద్రబాబు తాను కూడా రంగంలోకి దిగి అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఏపీలో అధికార పార్టీ ఒకరకమైన సానుకూల వాతావరణం ఏర్పరచుకుంది. సచివాలయం సిబ్బందిని మాత్రమే పింఛన్లకు పంపలేదు. వారితో పాటు ఎమ్మెల్యేలను కూడా పంపారు.
సంక్షేమ పథకాలను అమలు చేశానని...
కానీ 136 సార్లు బటన్ నొక్కానన్నావు. 2.75 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశానని చెప్పావు. నిజమే కావచ్చు. కానీ పబ్లిసిటీ ఏదీ? తాడేపల్లి కార్యాలయంలో కూర్చుని బటన్ నొక్కినంత మాత్రాన సరిపోతుందా? లేక ఏదో ఒక జిల్లాకు వెళ్లి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినంత మాత్రాన ఒరిగేదుందా? వైఎస్సార్, చంద్రబాబుల కంటే సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేసినా జగన్ కు అంత మైలేజీ రాకపోవడానికి, పాజిటివిటీ జనంలో కనిపించకపోవడానికి కారణం జగన్ మాత్రమే. ఎవరినీ భాగస్వామ్యుల్ని చేయకపోవడం, అంతా తానే అయి వ్యవహరించడం, కూర్చున్న చోట నుంచి కదలకపోవడంతోనే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి సంభవించిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. జనానికి దూరంగా ఉండాలనుకునే సీఎంను ఎవరు మాత్రం కోరుకుంటారన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికే దొరికి ఉంటుంది.
చిన్న వయసులో...
చంద్రబాబు ఏడుపదుల వయసు దాటినా ఈరోజు ఉదయం ఆరు గంటలకే లబ్దిదారుల ఇంటికి వెళ్లి మరీ పింఛను ఇచ్చారంటే .. అది కేవలం ఆయనకే కాదు.. పార్టీకి, ప్రభుత్వానికి ఎంత పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రజలకు కావాల్సింది కేవలం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయడమే కాదు.. వారికి స్వాంతన చెప్పే మాటలు ఎప్పటికప్పుడు చెప్పాలి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుని మీడియాకు దూరంగా ఉండి కనీసం ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియకపోతే వాళ్లు ఖచ్చితంగా విపక్షాలు చేసే విమర్శలు నమ్మక ఏమవుతుంది? అన్న విషయం ఆలోచించాలి. చిన్న వయసులో వచ్చిన ముఖ్యమంత్రి పదవీకాలాన్ని ఎక్కువ సమయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం చేయడం కూడా ఓటమికి ఒక కారణంగా ఖచ్చితంగా చెప్పాలి. అందుకే వైఎస్సార్, చంద్రబాబుల నుంచి పాలన ఎలా చేయాలన్న దానిపై ఇప్పటికైనా కొంత తెలుసుకుంటే.. భవిష్యత్ లో ఇలాంటి తప్పులు దొర్లవన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.