Ys Jagan : రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయ్.. చంద్రబాబు పాలన మర్చిపోయారు
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ రైజ్ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వైసీపీ నేత గింజిపల్లి శ్రీనివాసరావును పరామర్శించారు
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సన్‌రైజ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన వైసీపీ నేత గింజిపల్లి శ్రీనివాసరావును పరామర్శించారు. అతి దారుణంగా శ్రీనివాసరావును టీడీపీ కార్యకర్తలు హత్యచేయడానికి ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. టీడీపీ చేసే కిరాతకాలతో ప్రజలు భయపడరని, చంద్రబాబును, టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రయత్నిస్తారని జగన్ హెచ్చరించారు. ఇచ్చిన హామీలు, అభివృద్ధిపై ఫోకస్ పెట్టాల్సిన అధికార పార్టీ దాడులకు దిగుతుందని అన్నారు. అధికారపార్టీ దారుణాలకు అంతు లేకుండా పోయిందన్నారు.
వ్యతిరేకత పెరుగుతోంది...
చంద్రబాబు మీదవ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదని, పిల్లలు పాఠశాలలకు వెళుతున్నా తల్లికి వందనం కార్యక్రమాన్ని అటకెక్కించారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు పర్చకుండా డైవర్ట్ చేయడానికి ఈ దాడులు చేస్తున్నారన్నారు.రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. తప్పుడు సంప్రదాయాలను ఆపమని జగన్ కోరారు. లా అండ్ ఆర్డర్ దారి తప్పిందని అన్నారు. జరుగుతున్న హింసాత్మక ఘటనలపై హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపుతడతామని తెలిపారు.