Ys Jagan : మారాలి జగన్... వైఎస్ చేసిన రాజకీయాల్లోకి ఎప్పుడైనా తొంగి అయినా చూశావా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలి. తన తండ్రి చూపిన బాటలో నడవాలి

Update: 2024-07-29 06:16 GMT

తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వచ్చారంటారు. ఆయన ఆస్తిపాస్తులను అందిపుచ్చుకున్నారేమో కానీ రాజకీయాల్లో ఆవగింజంత అయినా జగన్ కు అబ్బలేదన్నది వాస్తవం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కానీ ఆయన ఏ హోదాలో ఉన్నప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్లు సయితం వైఎస్సార్ నాయకత్వ పటిమను మెచ్చుకునే వారు. ఆయన తనపై అనుకోకుండానో, వారసత్వంగా పడిన ఫ్యాక్షన్ ముద్రను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తొలగించుకోగలిగారు. ఎందుకంటే ఆయన వృత్తి రీత్యా డాక్టర్. ప్రజల నాడి ఆయనకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. ప్రజలతో మమేకమయ్యే తీరు కూడా ఆయనను చూసి నేర్చుకున్న వారు నేటి తరం రాజకీయ నేతలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు

ఒకసారి కలిస్తే....
ఒక్కసారి వైఎస్సార్ ను ఏ పనిమీదనో కలిసిన వ్యక్తి ఇక జీవితంలో ఆయన వెంట నడవడటమే తప్ప పక్క చూపులు చూడటమనదేి జరగని పని. తన దగ్గరకు సన్నిహితులను మాత్రమే కాదు... ఎంత స్థాయిలో ఉన్నవారినైనా ఆయన ఆదరించే తీరును ఎప్పటికీ మరువరు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఒకవైపు మొత్తుకుంటున్నా ఆయన జనంలోకి వెళ్లి చలించిపోయి స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. అందుకే నాటి ఆర్థికమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య చమత్కారంగా వైఎస్ గురించి ఒక మాట అనేవారు. వైఎస్ జనంలోకి వెళుతున్నారంటే నాకు గుండె దడ ఆగదని... బీపీ పెరిగిపోతుందని... ఎందుకంటే ఏం వరాలిస్తారో? ఎన్ని నిధులకు టెండర్ పెడతారోనన్న భయంతో రోశయ్య అన్న మాటలివి. ఇక ప్రతి రోజూ ప్రజాదర్బార్ పేరిట వైఎస్ సామాన్యులు కలుస్తూ స్వయంగా ఆయన వినతులు స్వీకరించేవారు. కార్యకర్త ఆపదలో ఉన్నారంటే చాలు ఆయన రెస్పాండ్ అయ్యే తీరు పై అనేక కథనాలు సీనియర్ పాత్రికేయులకు తెలియంది కాదు.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
కానీ జగన్ అలా కాదు.. 2014లో ఓడిపోయిన తర్వాత జనంలోకి వెళ్లారు. పాదయాత్ర చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? జనానికి దూరమయ్యారు. క్యాడర్ కోపానికి కారణమయ్యారు. నేతలు బయటపడకున్నా అసహనంతో ఉన్నా దానిని గమనించలేని స్థితిలోనే ఉన్నారు. తాను బటన్ నొక్కుతున్నానుగా.. ఇక తనకు తిరుగులేదు... తన బొమ్మ పార్టీని గెలిపిస్తుందన్న ధీమా ప్రతి అడుగులో కనిపించేది. అంతే కాదు విపక్షాల నోళ్లు నొక్కేయడం ఒక తప్పిదమయితే.. వారిపై కేసులు పెట్టి సానుభూతి తనంతట తానే అవతలి వారికి గంపగుత్తగా అందించారు. ఐదేళ్లు మీడియా ముందుకు రాకుండా మూతి ముడుచుకుని తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమైన జగన్ ఇప్పుడు మీడియా సమావేశాలు పెట్టి అన్యాయం జరుగుతుందంటూ ఆక్రోశమో.. ఆవేదనో వెళ్లగక్కుతున్నా దానిని పెద్దగా పట్టించుకునే వారు ఎవరుంటారు? జనంలోకి వెళ్లి జననేతగా మారాల్సిన వయసులో కేవలం కార్యాలయంలో కుర్చీకే పరిమితమై కోటరీ మధ్య బందీయై తనను తాను ఓటమిని కొని తెచ్చుకున్నారు.
వైఎస్ రాజకీయంలో....
అవును.. ఈ మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఎమ్మెల్యేలది కానే కాదు. మొత్తం జగన్ దే. ఎందుకంటే కొద్దోగొప్పో ప్రజల కోసం శ్రమించిన ఎమ్మెల్యేలు సయితం జగన్ పై ఉన్న నెగిటివ్ వేవ్ లో వాళ్లంతా కొట్టుకుపోయారంటే ఆ పాపం జగన్ కే అంటగట్టాల్సి వస్తుంది. కొన్ని కులాలను తాను దూరం చేసుకోవడం కూడా ఒక కారణం. 2009లో తేడా కొడుతుందని తెలిసి నీ తండ్రి వైఎస్ ఏం చేశారు? ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసేలా రాజకీయ వ్యూహం రచించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 16.32 శాతం ఓట్లు ఆ పార్టీ సాధించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలిగారు. కానీ జగన్ .. నువ్వు చేసిందేమిటి? పవన్ కల్యాణ్ ను పదే పదే రెచ్చగొట్టి కూటమికి బీజం పోశావు. ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఈ ఐదేళ్లు జగన్ కు కష్టకాలమే. ఇప్పటి కైనా తన తండ్రి వైఎస్ చేసిన రాజకీయంలో కొంతైనా అలవర్చుకోగలిగితే 2029 ఎన్నికల్లోనైనా విజయం సాధ్యం. అలా కాకుండా నేనింతే.. అన్నట్లు వ్యవహరిస్తే ఒక్క ఛాన్స్ తో రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది.. తస్మాత్ జాగ్రత్త అని రాజకీయ విశ్లేషకులు సయితం హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News