నారా వారి పాలనకు...
నారా వారి పాలన నరసకాసురుడి పాలనను తలపించిందని, దానిని మరొకమారు కోరుకోవద్దని సూచించారు. ప్రతి నెల ఒకటోతేదీన సూర్యోదయానికంటే ముందే వచ్చి పింఛను అందిస్తున్నామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందించామని తెలిపారు. ఎన్నడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అనేక పథకాలను తెచ్చామన్నారు. ప్రతి రూపాయి పేదలకు వెళ్లాలని ప్రభుత్వం భావించిందన్నారు. తనపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. పొత్తుల మారి, జిత్తుల మారి పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు. డబుల్ సెంచరీ సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. యాభై ఎనిమిది నెలల పాలనలోనే ఎన్నో అద్భుతాలను చేసి చూపించామని జగన్ అన్నారు. ఈ పనులను చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నామని తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామన్నారు.
విద్య, వైద్య రంగాల్లో...
పిల్లల చదువులను ఎలా మార్చమో చూడాలన్నారు. పిల్లలకు ఓటు లేదని వారిని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. రేపటి తరం అని, వాళ్లు బాగుపడితే తలరాతలు మారతాయని భావించి ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలే మార్చామని, ఇంగ్లీష్ మీడియం పెట్టిందీ జగన్ ప్రభుత్వమేనని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చామన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. వైద్య రంగాన్ని తీసుకుంటే.. ఆసుపత్రులను పూర్తిగా మార్చామన్నారు. వైద్యులను, సిబ్బందిని నియమించి పేదవారికి ఉచిత వైద్యాన్ని అందించగలిగామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా పెంచామని జగన్ తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకు వచ్చి ఆరోగ్యభద్రతకు ఈ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.
మోసాల బాబు...
చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు అని జగన్ అన్నారు. రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగ అని అన్నారన్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తే బట్టలు ఆరవేయడానికి కూడా తీగలు పనికిరావన్నది ఈ చంద్రబాబు అని అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మ్యానిఫేస్టోను చూస్తే అర్థమవుతుందన్నారు. రైతుల రుణమాఫీ చేస్తానని చెయ్యలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అక్కచెల్లెమ్మలను మోసం చేశాడన్నారు. బాబుకు ఓటేస్తే మరో పదేళ్లు వెనక్కు వెళ్లాల్సిందేనని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఇవ్వకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతను మోసం చేశాడన్నారు. అందుకే మోసాల పుట్ట చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారని వాటిని నమ్మవద్దని జగన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని, ప్రతి నగరంలో హైటెక్ సిటీ ని నిర్మిస్తానని చెప్పి నాడు అధికారంలోకి వచ్చారన్నారు.