ఇంత జరిగాక.. జనసేనలో చేరుతున్నా అని చెప్పడం ఏమిటో?
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను ఆదివారం నాడు కలిసిన ఎమ్మెల్యేపై వైఎస్‌ఆర్‌సీపీ వేటు వేసింది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికార పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా విజయానందరెడ్డిని నియమించినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న శ్రీనివాసులు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
జనసేన పార్టీలో చేరనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తాజాగా వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో గురువారం పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. వైసీపీలో తనకు మోసం జరిగిందని అన్నారు.. రాబోయే ఎన్నికల్లో మరోసారి చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా లేదా రాజ్యసభకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారని.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అన్నారు. సొంత నిర్మాణ సంస్థ జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా చేపట్టిన పనులకు బిల్లులు రూ.73 కోట్లు ఆపేశారని ఆరోపించారు.