YSRCP : ఇన్‌ఛార్జిని మార్చేసిన వైసీపీ హైకమాండ్.. వత్తిడిని తట్టుకోలేక
వైసీపీ గతంలో ప్రకటించిన ఇన్‌ఛార్జులను మార్చేందుకు సిద్దపడింది. ఒకరిని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది
వైసీపీ గతంలో ప్రకటించిన ఇన్‌ఛార్జులను మార్చేందుకు సిద్దపడింది. ఒక అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవిని ఇటీవల అరకు శాసనసభకు ఇన్‌ఛార్జిగా నియమించింది. అరకు పార్లమెంటు ఇన్‌ఛార్జిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఖరారు చేసింది. అయితే గొడ్డేటి మాధవిని ఇన్‌ఛార్జిగా ప్రకటించడంపై అరకు నియోజకవర్గం వైసీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది.
నాన్ లోకల్ అంటూ...
గొడ్డేటి మాధవి నాన్ లోకల్ అంటూ వారు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి అక్కడి వైసీపీ నేతలతో చర్చలు జరిపినా తమకు లోకల్ నుంచే అభ్యర్థిని ఖరారుచేయాలని, లేకుంటే సహకరించబోమని కూడా వారు తెగేసి చెప్పారు. దీంతో పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది. గొడ్టేటి మాధవిని అరకు ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆమె స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం పేరును ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈరోజు మత్స్యలింగం రావడంతో ఆయన పేరునే అరకు ఇన్‌ఛార్జి పదవికి ఎంపిక చేసే అవకాశాలున్నాయి.