సొంత, దత్త పుత్రులను ప్రజలు నమ్మరు: లక్ష్మీపార్వతి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగు అకాడమీ చైర్మన్, వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర

Update: 2023-06-27 11:47 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగు అకాడమీ చైర్మన్, వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రతిపక్షాలకు ప్రజలు గుర్తొచ్చారన్నారు. చంద్రబాబు తన సొంతపుత్రుడితో పాటు దత్తపుత్రుడు ఇద్దరినీ ప్రజలపైకి వదిలాడని మండిపడ్డారు. సొంత, దత్తపుత్రులు రాష్ట్రవ్యాప్తంగా ఎంత తిరిగినా ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలన్నారు. ఎన్టీఆర్ మనవళ్లు జూ.ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేసారు.

నందమూరి అభిమానులు లోకేష్ ను రాజకీయాల నుండి తరిమికొట్టాలని లక్ష్మీపార్వతి అన్నారు. ''14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉంది? ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఆయన తనయుడు లోకేశ్‌కు రాజకీయాల పట్ల అవగాహన లేదు. ఆయన తెలుగు అనర్గళంగా మాట్లాడేందుకు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు కానీ మైక్ దొరికిన ప్రతిసారీ తడబడతాడు. తెలుగు ప్రజలు ఇప్పటికీ లోకేష్‌ని ఎన్టీఆర్ మనవడిగా అంగీకరించడం లేదు'' అని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు ఒక శాడిస్ట్ అని, సైకో అని లక్ష్మీపార్వతి ఘాటుగా వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. 2019లోనే చంద్రబాబు చాఫ్టర్‌ క్లోజ్‌ అయ్యిందన్నారు.

''ఇసుక మాఫియాతో చంద్రబాబు రూ. 4000 కోట్లు కూడబెట్టాడు. ఇసుక మాఫియాను అడ్డుకుందని ఓ అధికారిణిని నిర్దాక్షిణ్యంగా కొట్టించారు. టీడీపీ అవినీతిని వైసీపీపై మోపుతోంది, అది పూర్తిగా చెత్త'' అని లక్ష్మీపార్వతి అన్నారు. తన రాజకీయాల కోసమే చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. పవన్‌ ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవని, చంద్రబాబు నీడ నుంచి పవన్ బయటకు రావాలి అని లక్ష్మీపార్వతి సూచించారు. పవన్ పై తనకు సానుభూతి ఉందని, ఆయన చంద్రబాబు రాజకీయాలకు బలికావద్దని హితవు పలికారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతానికి రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు.

Tags:    

Similar News