పవన్ కు పేర్ని "చెప్పుల" కౌంటర్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం

Update: 2023-06-15 06:48 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును.. వారాహిగా పెట్టుకున్నారంటూ పవన్‌ కల్యాణ్‌పై సెటైర్ వేశారు. పవన్‌ పూటకో మాట మాట్లాడతారని అన్నారు. రోజుకోక డైలాగ్‌ చెప్పి.. పవన్‌ దాన్ని వ్యూహం అంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాగుండటం కోసం పవన్‌ ఏదైనా చేస్తారని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్‌ ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. ఆఫీసులో కూర్చొని సినిమా డైలాగులు, సొల్లు కబుర్లు చెప్పే పవన్‌.. ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్‌ను అడ్డం పెట్టుకుని జనసేనను చంద్రబాబు నడుపుతున్నాడని ఆరోపించారు.

చంద్రబాబు, పవన్‌, బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు. పవన్‌ ప్రతి సినిమాకు రిలీజ్‌కు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కుతాడని అన్నారు. గులాబీ జెండాని వెనుక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది ఎవరు? అని నిలదీశారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆంధ్ర రాష్ట్రాన్ని తిడుతుంటే పవన్‌ ఏం చేస్తున్నారు, జగన్‌ సీఎం అయినప్పటి నుంచి పవన్‌ ఒక్క సినిమా అయినా ఆగిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్‌, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా టికెట్లపై జీఎస్టీ వేశారా? లేదా? చెప్పాలన్నారు. సీఎం పదవి ఎవరో దానం చేస్తే వచ్చేది కాదని పవన్‌కు పేర్ని సూచించారు.

చంద్రబాబుతో సావాసం చేసి పవన్‌ దిగజారిపోయాడని విమర్శించారు. ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీకి వెళ్తావు.. వ్యూహాలను నమ్ముకుంటే అసెంబ్లీ గేటు దాకా కూడా వెళ్లలేవు అని పవన్‌కు పేర్ని నాని హితబోధ చేశారు. భీమవరంలో లక్ష ఓట్లు ఉంటే.. లక్షా 8 వేల ఓట్లు పోలవడంతో పవన్‌ ఓడాడనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం పవన్‌ ఎంతకైనా దిగజారుతాడని అన్నారు. కాపు బలిజ తెలగ బిడ్డలు హీరోగా భావించే వంగవీటి రంగాను చంపిన వ్యక్తితో పవన్‌ చేతులు కలిపాడన్నారు. పవన్‌ అబద్ధాలు చెబుతూ అమాయక యువతతో ఈలలు వేయించుకుంటున్నారని అన్నారు. పవన్‌ డ్రామాలు వేస్తే మక్కెలిరగదీస్తాం అంటూ నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. 

Tags:    

Similar News