గుంటనక్కలు నిద్రలేచాయి.. ఏమరపాటు వద్దు
గడిచిన నాలుగు ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో.. సీఎం జగన్ తన చేతల్లో చూపించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ
గడిచిన నాలుగు ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో.. సీఎం జగన్ తన చేతల్లో చూపించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సీఎంగా బాధత్యలు చేపట్టి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సజ్జల మట్లాడుతూ.. సీఎం జగన్ తన నాలుగేళ్ల పాలనా కాలంలో చరిత్ర సృష్టించారని, ఇచ్చిన హామీలను నెరవేర్చారని ఎలిపారు.
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయన్న సజ్జల.. గుంట నక్కలు మళ్లీ నిద్రలేచాయన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి గుంట నక్కలు తట్టుకోలేకపోతున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రజలకు కొత్త హామీలు ఇస్తూ.. పగటి వేషాలు కడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని మరోసారి దోపిడి చేసేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ప్రజలను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన పాలనలో ఏం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న విషయం ప్రజలకు తెలుసునన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగా చంద్రబాబు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదన్నారు. తెలుగు దేశం పార్టీ.. చంద్రబాబు పెట్టిన పార్టీ కాదని, మామను దొంగ దెబ్బ కొట్టి, వెన్ను పోటు పొడిచి తెచ్చుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబును అధికారంలో నిలబెట్టేందుకు దత్తపుత్రుడు ప్యాకేజీ తీసుకున్నాడని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పెద్ద యుద్ధం అన్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడుతున్నాడని, గత పాలన కాలంలో చంద్రబాబు ఏం చేశాడో ప్రజలకు చాలా గుర్తుందన్నారు. అన్న క్యాంటీన్ పేరుతో బాబు ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ప్రజలకు చేసిన మేలు ఏం లేదని సజ్జల విమర్శించారు. ప్రజలను భ్రమలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆశలను పూర్తి చేయడానికి కృషి చేయాలని చెప్పారు. వై నాట్ 175ను నిజం చేసే దిశగా అడుగులు వేయాలని వైసీపీ శ్రేణులను కోరారు.
''నాలుగేళ్ళ క్రితం ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అనంతరం ఇచ్చిన మాటకు కట్టుబడి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి దేశంలో మరే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.'' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ట్వీట్‌కు జత చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 2019 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాల్లో గెలుపొంది, అఖండ విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో 25 లోక్ సభ స్థానాలకు గాను 22 స్థానాల్లో గెలుపొందింది.