Duvvada Srinivas : దువ్వాడకు షాకిచ్చిన జగన్.. టెక్కలి ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలిగింపు
దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను నియమించింది.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం వీధికెక్కింది. కుటుంబ కలహాలతో దువ్వాడ శ్రీనివాస్ పార్టీ పరువు ప్రతిష్టలను దిగజార్చారన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. దువ్వాడ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మొత్తం మీద పడుతుందని ఆ ప్రాంత ఫ్యాన్ పార్టీ నేతలు ఆందోళన చెందారు. దీంతో వైసీపీ అధినాయకత్వం ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంది. టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను నియమించింది.
కుటుంబ విభేదాలు...
దువ్వాడ శ్రీనివాస్ ఆమె భార్య దువ్వాడ వాణితో దూరంగా ఉంటున్నారు. ఆయన మరొక మహిళతో సహజీవనం చేస్తున్నాంటూ గత కొన్ని రోజులుగా దువ్వాడ వాణితో పాటు శ్రీనివాస్ కుమార్తె హైందవి ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు ఇంట్లోకి అనుమతించాలని కోరుతున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇది పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మీడియాలో ప్రతి రోజూ ఇదే విషయంపై చర్చ జరుగుతుండటంతో డ్యామేజీ భారీ స్థాయిలో జరుగుతుందని భావించిన వైఎస్ జగన్ ఆయనను టెక్కలి ఇన్‌ఛార్జి నుంచి తప్పించారు.
వరస ఓటములతో...
ఆయన స్థానంలో గతంలో ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన పేరాడ తిలక్ ను నియమించారు. పేరాడ తిలక్ గత ఎన్నికల్లో పార్లమెంటు స్థానంలో పోటీ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కు వైసిపీ నాయకత్వం మంచి ప్రయారిటీ ఇచ్చింది. ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. తిరిగి టెక్కలి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. అయితే 2009 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో వరసగా పోటీ చేస్తున్నా ఓటమి పాలవుతూనే వస్తున్నారు. అదీ ఆయన ట్రాక్ రికార్డు. మొత్తం మీద దువ్వాడకు వైఎస్ జగన్ టెక్కలి ఇన్‌ఛార్జిగా తొలగించి గట్టి షాక్ ఇచ్చినట్లయింది.