YSRCP : సీమలో మళ్లీ ఫ్యాన్ గాలి వీస్తుందా? క్రమంగా పుంజుకుంటోందా?

రాయలసీమలో మళ్లీ ఫ్యాన్ గాలి వీస్తుంది.;

Update: 2025-01-13 04:48 GMT

రాయలసీమలో మళ్లీ ఫ్యాన్ గాలి వీస్తుంది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో క్రమంగా వైసీపీ బలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. కూటమి సర్కార్ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు సీమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్న భావన ఆ ప్రాంత ప్రజల్లో బలపడుతున్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు కూటమి నేతల మధ్య అనైక్యత కూడా వైసీపీ బలం పుంజుకోవడానికి కారణంగా చెబుతున్నారు. అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే వైసీపీకి, కూటమి ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే వెల్ ఫేర్ స్కీమ్ అమలులో మాత్రం కూటమి సర్కార్ వెనుకంజలోనే ఉంది.

గత ఎన్నికల్లో...
గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉండగా కూటమి పార్టీలకు పన్నెండు స్థానాలు, వైసీపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే లభించాయి. అలాగే అనంతపురం జిల్లాలోని పథ్నాలుగు నియోజకవర్గాలకు గాను పథ్నాలుగు స్థానాల్లోనూ కూటమి పార్టీలు విజయం సాధించాయి. వైసీపీకి జీరో స్థానాలు దక్కాయి. కడప నియోజకవర్గంలో ఉన్న పది స్థానాల్లో కూటమికి ఏడు, వైసీపీకి మూడు స్థానాలు దక్కాయి. చిత్తూరు జిల్లాలో పథ్నాలుగు స్థానాలకు పన్నెండు నియోజకవర్గాల్లో కూటమి, రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు కూటమి పార్టీల నేతల మధ్య ఈ జిల్లాల్లో ఎక్కడా సమన్వయం లేదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాల్లో ఏడు స్థానాలను మాత్రమే వైసీపీ దక్కించుకుంది.మిగిలనవన్నీ కూటమి గెలుచుకుంది.
కూటమి నేతల మధ్య...
అనంతపురం, కర్నూలు జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు బాహాటంగానే కనపడుతుండటంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. మరొక వైపు మంత్రి వర్గంలో పదవులు లభించలేదని సీనియర్ నేతలు సయితం పెద్దగా పట్టించుకోవడం లేదు. అనేక నియోజకవర్గాల్లో కూటమి నేతలు నియోజకవర్గంపై పట్టు సాదించుకునేందుకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదోని, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కల్యాణదుర్గం, ప్రొద్దుటూరు వంటి నియోజకవర్గాల్లో కూటమి పార్టీ నేతలు ఒకరికొకరు దూషించుకుని, తమ గ్రూపును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు బలహీనమయ్యాయన్న టాక్ బలంగా వినపడుతుంది.
ఒకరంటే మరొకరికి...
మరొకవైపు తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలు కూడా సీమపై ప్రభావం చూపుతున్నాయి. ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. అధినాయకత్వం కూడా కూటమి నేతల మధ్య రాజీ కుదర్చలేని పరిస్థితుల్లో ఉంది. ఇసుక పాలసీ, మద్యం పాలసీని ఎవరికి వారు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో భాగంగా తమ అనుచరులకు కట్టబెట్టాలన్న ప్రయత్నంలో విభేదాలు తలెత్తుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు ఇచ్చిన అవకాశాలే వైసీపీ తన విజయావకాశాలుగా మలచుకునే ఛాన్స్ కనపడుతుంది. మరొక వైపు ఈ నెల మూడో వారం నుంచి జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనచేస్తుండటం కూడా వైసీపీకి రాయలసీమలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా. మరి కూటమి నేతలు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకుని సరిదిద్దుకోగలిగితే కొంత తేరుకునే అవకాశాలు లేకపోలేదు.


Tags:    

Similar News