Raghurama: ఛాతీపై కూర్చొని చంపడానికి యత్నం.. వైఎస్ జగన్ ఏ3

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

Update: 2024-07-12 07:26 GMT

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. 2021లో రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో విద్వేషపూరిత ప్రసంగం, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టారని, తనపై హత్యయత్నం కూడా జరిగిందంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు రఘురామరాజు ఫిర్యాదు చేశారు.

పోలీసులు సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. ఈ కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏ3గా పోలీసులు చేర్చారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. కస్టడీలో తనను హింసించారని... తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని రఘురామ ఫిర్యాదులో తెలిపారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు.


Tags:    

Similar News