Ys Sharmila : నేడు షర్మిల మాటలను బట్టే భవిష్యత్ బాట తేలనుందా?

వైఎస్ షర్మిల నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఆమె ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది

Update: 2024-01-21 02:30 GMT

వైఎస్ షర్మిల నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకోనున్న షర్మిల పీసీసీ చీఫ్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు హాజరు కానున్నారు. కానూరులోని ఒక ఫంక్షన్ హాలులో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారాన్ని కూడా గత పీసీసీ అధ్యక్షుల కంటే భిన్నంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో కాకుండా ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆహ్వానాలు వెళ్లాయి.

ర్యాలీగా వచ్చి...
అయితే ప్రమాణ స్వీకారం అనంతరం విజయవాడలో ర్యాలీగా ఆంధ్రరత్న భవన్ కు వచ్చి అక్కడ పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే షర్మిల కార్యకర్తల సమావేశంలో ప్రసంగం ఎలా ఉండనుందన్న దానిపైనే అంతా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తన సోదరుడు పార్టీ వైసీపీపై విమర్శలకు దిగుతారా? లేదా? వైఎస్ కాంగ్రెస్ నేత కాబట్టి ఆయన విషయానికే పరిమితమవుతారా? అన్నది తేలనుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి అమరావతి రాజధాని వరకూ షర్మిల ప్రసంగంలో చోటు చేసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చప్పగా సాగితే...
దీంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను గురించి కూడా ప్రస్తావిస్తారని అంటున్నారు. వైఎస్ పాలనలో ఏం జరిగిందీ? ఇప్పుడు జరుగుతున్నదేంటి? అన్న దానిపై ఆమె సవివరంగా మాట్లాడతారని తెలిసింది. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని పరోక్షంగా తన సోదరుడికి నొక్కి చెప్పే అవకాశాలు లేకపోలేదు. పీసీసీ చీఫ్ గా తొలి ప్రసంగమే చప్పగా సాగితే కార్యకర్తలతో పాటు నేతలు తమ వెంట ఉండరని షర్మిలకు తెలియంది కాదు. అందుకే కొంత ఎఫెన్స్ గానే ఆమె ప్రసంగం ఉండబోతుందన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి షర్మిల ప్రసంగంపైనే ఉంది. మరి చూడాలి. బాధ్యతలను స్వీకరించిన తర్వాత తిరిగి ఆమె హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు.



Tags:    

Similar News