Ys Jagan : జగన్ లో రియలైజేషన్ వచ్చిందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2024లో తన పార్టీ దారుణ ఓటమి తర్వాత కొంత మేర ఆయనకు రియలైజేషన్ వచ్చినట్లుంది.

Update: 2024-10-05 06:42 GMT

ys jagan mohan reddy

వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2024లో తన పార్టీ దారుణ ఓటమి తర్వాత కొంత మేర ఆయనకు రియలైజేషన్ వచ్చినట్లుంది. ఆయన తన ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులేమిటో ఒక్కొక్కటీ తెలుసుకుంటున్నారు. కేవలం సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చిపెట్టవని, బటన్ నొక్కితే ఈవీఎంలలో జనం బటన్ నొక్కరని జగన్ కు జ్ఞానోదయం అవుతున్నట్లు కనిపిస్తుంది. కేవలం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కావడం, నేతలను ప్రజలకు దూరం చేయడంతో పాటు వాలంటీర్ల వ్యవస్థతో తాను కొత్త వ్యవస్థను తీసుకు వచ్చానని భ్రమలో ఉన్నానని అర్థమయినట్లుంది. కేవలం నగదు ఇచ్చినంత మాత్రాన ప్రజలు సంతృప్తి చెందరని, వారికి అభివృద్ధి కూడా కావాలని వైఎస్ జగన్ కు క్రమంగా బోధపడినట్లుంది.

అంతర్మధనం ఆరంభమైందా?
ఇక పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలను దూరం చేసుకోవడంపై కూడా ఆయన అంతర్మధనం చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక సభలో మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని వెల్లడించారు. జగన్ జనాన్ని బాగు చేద్దామని, కార్యకర్తలను మరచిన మాట వాస్తవమేనని అంగీకరించినట్లు ఆయన తెలపడం కూడా జగన్ ఆలోచనలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరగడానికి కార్యకర్తలు పట్టుదలగా పనిచేయకపోవడం కూడా ఒక కారణమని ఆయన భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద తెగించి పోరాడిన వైసీపీ క్యాడర్మొన్నటి ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు.
బలమున్న ప్రాంతాల్లో...
చివరకు తన సొంత జిల్లా కడప నియోజకవర్గంతో పాటు తనకు పట్టున్న రాయలసీమ ప్రాంతంలోనూ దారుణ ఓటమికి కారణం ఇదేనన్న అభిప్రాయం ఆయనలో కలిగిందనే అంటున్నారు. తాను జనంలో లేకపోవడం ఒక కారణమయితే కార్యకర్తల మనోభావాలను పక్కన పెట్టడం, ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. తమ సొంత ఖర్చులతో పార్టీకి 151 స్థానాలను సాధించిపెట్టిన కార్యకర్తలను కాదని, అది తన ఘనత అని జగన్ మురిసిపోయిన విషయాన్ని కూడా ఆయన గుర్తుకు చేసుకున్నట్లుంది. అధికారంలోకి రాగానే కార్యకర్తలను పట్టించుకోకపోవడం, వారు ఆర్థికంగా మరింత బలహీనం కావడంతో పార్టీ జెండాను కూడా మోయలేని పరిస్థితికి వచ్చారు.
ఆర్థికంగా నష్టపోయిన...
మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేయడంతో అవతలి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నామని జగన్ అనుకున్నారు తప్పించి, తనకు అన్ని రకాలుగా తోడ్పడిన వారికి ఆదాయాన్ని దూరం చేస్తున్నానని జగన్ గ్రహించలేకపోయారు. ఎమ్మెల్యేలకు నిధులు కూడా ఇవ్వకపోవడంతో కార్యకర్తలకు వారు కూడా ఆర్థికంగా చేయూతను ఇవ్వలేకపోయారు. తామే నష్టపోయామన్న పరిస్థితుల్లో ఉన్న నాటి ఎమ్మెల్యేలు కార్యకర్తలకు ఏం పంచిపెడతారన్న ప్రశ్నకు ఇప్పుడు జగన్ కు సమాధానం దొరికినట్లయింది. అయితే జగన్ కు ఎందుకు క్యాడర్ అవసరమో ఇప్పుడు అర్థమయినట్లుంది. అయితే ఇప్పటికీ వైసీపీకి క్యాడర్ బలం తక్కువగా లేదు. దానిని ఈ నాలుగున్నరేళ్లలో మళ్లీ యాక్టివ్ చేయగలిగితే సక్సెస్ కు దారి జగన్ కు దగ్గరలోనే ఉంటుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News