చీఫ్ సెక్రటరీకి రోజా విన్నపం ఇదే
నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు
నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కలసి ఆమె వినతిపత్రాన్ని అందచేశారు. మండల, మున్సిపాలిటీ కార్యవర్గాల తీర్మానాల కాపీలను కూడా రోజా ఆయనకు అందజేశారు. తిరుపతితో నగరి నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని గురించి సమీర్ శర్మకు తెలియజేశారు. తిరుపతి నుంచి నగరి నియోజకవర్గం తొమ్మిదో కిలోమీటర్ నుంచి ప్రారంభమవుతుందని రోజా చెప్పారు.
అనుబంధాన్ని....
నగరి నియోజకవర్గం మొత్తం తిరుపతికి వెళ్లే జాతీయ రహదారిని ఆనుకునే ఉంటుందని చెప్పారు. నగరి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలు తిరుపతి అర్బన్ డెవెలెప్‌మెంట్ అథారిటీకి ఆస్తిపన్ను చెల్లింపులు జరిగాయని రోజా వెల్లడించారు. ఇప్పటికీ పుత్తూరు, నగరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాలాజీ జిల్లా పేరు మీదనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని రోజా చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు వివరించారు. తిరుమల స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో వినియోగించే గొడుగులు చెన్నై నుంచి నగరి నియోజకవర్గం మీదుగానే వెళతాయని సెంటిమెంట్ ను గుర్తు చేశారు. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె చీఫ్ సెక్రటరీని కోరారు.