మాల్ ప్రాక్టీస్ మొదలైందే నారాయణ, చైతన్యలోనే.. సజ్జల హాట్ కామెంట్స్

పేపర్ లీకేజీలను సంస్థలు వ్యవస్థీకృతం చేశాయి. ఆ సంస్థకి అధినేత నారాయణ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.

Update: 2022-05-10 11:33 GMT

others

నారాయణ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఎస్వీ నారాయణ స్కూల్‌లో జరిగిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలిందన్నారు. నారాయణ సంస్థల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే పేపర్ల లీకేజీ జరిగిందన్నారు. లీకేజీలను నారాయణ వ్యవస్థీకృతం చేశారని ఆయన మండిపడ్డారు. పేపర్ల మాల్ ప్రాక్టీస్ మొదలైందే నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లోనని ఆయన అన్నారు.

పేపర్ల లీకేజీ వ్యవహారంలో అధికారులకు స్వేచ్చ ఇవ్వడంతో విచారణ జరిపి అసలు దొంగను పట్టుకున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదని.. తమ ప్రభుత్వం వాటిని సీరియస్‌గా తీసుకుందన్నారు. ఉపాధ్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. తప్పు చేస్తే ఎవ్వర్నీ వదలొద్దని సీఎం జగన్ చెప్పారని సజ్జల అన్నారు. కడప జిల్లాలో వైఎస్ కొండారెడ్డి అరెస్టును ఆయన ఉదహరించారు. ఎవరైనా జగన్ నిర్ణయం ఒకటేనని.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.

చంద్రబాబు నిస్సిగ్గుగా వెనకేసుకు రావడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా ఎమ్మార్వోతో ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసని.. ఇంకా ఎవరూ ఆ ఘటనను మర్చిపోలేదన్నారు. ఐఏఎస్ అధికారితో ఎంపీ కేశినేని నాని, అప్పటి ఎమ్మెల్యే బోండి ఉమా ప్రవర్తించిన తీరు కూడా గుర్తుందన్నారు.

అలాంటి వారిని చంద్రబాబు సపోర్ట్ చేశారని.. టీడీపీకి చెందిన వారైతే చట్టాలు కూడా వర్తించవన్నట్లు ప్రవర్తించారని సజ్జల అన్నారు. కానీ జగన్ ప్రభుత్వంలో అలాంటివి చెల్లవని.. తమ పార్టీకి చెందినవారైనా తప్పు చేస్తే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తాము, తమ పార్టీ నడుచుకుంటుందని ఆయన చెప్పారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పామని.. ఆధారాలతో కేసులు నడుస్తాయని స్పష్టం చేశారు.

Tags:    

Similar News