పురందేశ్వరిపై మొదలైన అటాక్.. ఎవరితో అంటే?

కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు...వైజాగ్ స్టీల్ ప్లాంట్

Update: 2023-07-29 09:11 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా విమర్శలకు దిగారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అనే సందేహం వస్తోందని.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడితే పురందేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మరి మంత్రి చెప్పింది తప్పా? పురందేశ్వరి చెబుతున్నది తప్పా? స్పష్టత ఇవ్వాలని రోజా అన్నారు. టీడీపీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారు. ఓ మ్యాప్‌ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో గాడిదలు కాశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గుర్తుకురాదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయనకు అభివృద్ధి గుర్తుకు వస్తుందని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ ధ్యేయమని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పురందేశ్వరిపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాయల ఫకీరు వంటివాడని, ఆయన మాయలో పడి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా నష్టపోయారని.. పురందేశ్వరి గారూ... ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడుస్తామంటే మీ ఇష్టం అని అన్నారు. పురందేశ్వరి తండ్రి స్థాపించిన పార్టీని ఇప్పుడు మరిది నడుపుతున్నారు... వీళ్లేమో వేరే పార్టీని నడుపుతున్నారంటూ గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. మరిది స్క్రిప్టునే పురందేశ్వరి మాట్లాడుతున్నారని, ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరా? చంద్రబాబా? అనేది చెప్పాలన్నారు. పురందేశ్వరి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.
ఇక వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా పరోక్షంగా పురందేశ్వరిపై సెటైర్లు వేశారు. "కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు...వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?" అంటూ ఆయన ట్వీట్ చేశారు.


Tags:    

Similar News