Gold Prices : బ్రేకుల్లేకుండా పరుగెట్టడమంటే ఇదే కదా.. అదే కదా బంగారం

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరలపై వంద రూపాయలు పెరగింది. వెండి ధర కూడా పెరిగింది

Update: 2024-01-21 03:31 GMT

పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వాటికి కళ్లెం పడేటట్లు లేదు. వరసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో ఇక బంగారం భారంగా మారనుందేమో. అవును.. రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆ మధ్య కొన్ని రోజులు స్థిరంగానూ, మరికొన్ని రోజుల్లో స్వల్పంగానూ తగ్గి కొంత ఊరట కల్గించినా తాజాగా రెండు రోజుల నుంచి మాత్రం పసిడి ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఇలాగే పెరుగుతూ పోతే బంగారం కొనటం అసాధ్యమేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.

డిమాండ్ ఉన్న రోజుల్లోనే...
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే.. రోజూ చెప్పే కారణాలే మళ్లీ చెప్పుకోవాల్సి వస్తుంది. అందులో నిజం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే వాస్తవంలో మాత్రం ధరలు అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు మాత్రం మందగిస్తాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజుల్లోనే ధరలు పెరుగుతుండటం బంగారానికే కాదు.. ప్రతి వస్తువుకూ ఉండే లక్షణమే. అయితే బంగారానికి కాస్త ఎక్కువగా ఉంటుంది. స్టేటస్ సింబల్ గా పసిడి మారడంతో బంగారం ధరలను ఆపడం ఇక ఎవరితరమూ కాదేమోనని అనిపిస్తుంది.
స్వల్పంగా పెరిగినా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరలపై వంద రూపాయలు పెరగింది. వెండి ధరలో కూడా పెరుగుదల ఆగడం లేదు. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,800 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,050 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం రెండు వందలు పెరిగి 77,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News