విద్యాశాఖ మంత్రి కోడలు ఆత్మహత్య
సవితా పర్మార్ బలవన్మరణానికి పాల్పడిన సమయంలో.. మంత్రి ఇందర్ సింగ్ భోపాల్ లో ఉండగా.. దేవరాజ్ సింగ్ పక్క గ్రామంలోని..
షాజపూర్ : మధ్యప్రదేశ్ విద్యాశాఖమంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు సవితా పర్మార్(23) షాజపూర్ లోని తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఈ ఘటన జరగ్గా.. బుధవారం ఉదయం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇందర్ సింగ్ కుమారుడు దేవరాజ్ సింగ్ తో సవితకు మూడేళ్ల క్రితం వివాహమయింది. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
సవితా పర్మార్ బలవన్మరణానికి పాల్పడిన సమయంలో.. మంత్రి ఇందర్ సింగ్ భోపాల్ లో ఉండగా.. దేవరాజ్ సింగ్ పక్క గ్రామంలోని మహమ్మద్ ఖేరాలో ఒక వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. కాగా.. ఇంట్లో ఇతర బంధువులుండగానే సవిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతదేహం వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆందోళనలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో.. మంత్రి ఇంటివద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.