ముషీరాబాద్ కార్పొరేటర్ గౌసుద్దీన్ అరెస్ట్

నగరంలో రాత్రివేళలో హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులపై ముషీరాబాద్ కార్పొరేటర్ గౌసుద్దీన్..

Update: 2022-04-06 11:57 GMT

విధినిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌసుద్దీన్ పై 353, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. గౌసుద్దీన్ మాదిరిగానే నగరంలో చాలామంది కార్పొరేటర్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపై పబ్లిక్ గానే గొడవపడుతున్నారు. అధికారంలో ఉన్న తమను ప్రశ్నించేందుకు వీల్లేదని వీరంగం వేస్తున్నారు.

నగరంలో రాత్రివేళలో హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులపై ముషీరాబాద్ కార్పొరేటర్ గౌసుద్దీన్ నోరుపారేసుకున్నాడు. అర్థరాత్రి దాటినా హోటల్ తెరిచి ఉంచారేంటని పోలీసులు ప్రశ్నించడంతో.. కార్పొరేటర్ రెచ్చిపోయాడు. నోటికి ఎంతమాట వస్తే అంతమాట అనేశాడు. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామంటూ గౌసుద్దీన్‌ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు స్పష్టం చేశాడు. కానీ.. సమయానికి హోటళ్లను మూసివేయాలని తమకు పై అధికారుల నుంచి ఆదేశాలొచ్చాయని పోలీసులు ఎంతచెప్పినా వినిపించుకోలేదు.
మీరు 100 రూపాయలకు పనిచేసే మనుషులు. ఇక్కడకు కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వచ్చాడని మీ SI, సీఐకి చెప్పండి అంటూ రుబాబు ప్రదర్శించాడు. రంజాన్ నెలపాటు ఇటు వైపు రావొద్దంటూ పోలీసులను గద్దించాడు. ఇదంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ప్రవర్తనను అసలు ఊరుకోవద్దంటూ డీజీపీకి ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు. పార్టీ ఏదైనా.. గొడవ చేసింది ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీరియస్‌ అయ్యారు కేటీఆర్. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News