డివైడర్ ను ఢీ కొట్టిన అంబులెన్స్.. ఆక్సిజన్ సిలిండర్ పేలి..

మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అంబులెన్స్‌లో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి..;

Update: 2023-07-25 06:17 GMT
vanasthalipuram ambulance accident, BN Reddy Signal

vanasthalipuram ambulance accident

  • whatsapp icon

ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అతడి ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అంబులెన్స్‌ డ్రైవర్‌ మహేశ్‌ (35) మృతిచెందాడు. నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌ చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం సీఐ జలేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అంబులెన్స్‌లో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి అత్యంత వేగంగా వస్తున్న సమయంలో సాగర్‌ రహదారిపై బీఎన్‌ రెడ్డి చౌరస్తా వద్ద ఒక్కసారిగా అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

అతివేగంతో ఢీకొట్టడంతో వాహనం బోల్తాపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. దీంతో అంబులెన్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ మంటల్లో అంబులెన్స్ ధ్వంసమైంది. ఈ క్రమంలో డ్రైవర్‌ మృతిచెందడంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News